ప్రభుత్వ ఇన్ని సార్లు ఫెయిల్ అయినట్లు స్పష్టంగా తెలుస్తున్నా సీఎం కేసీఆర్ కు మాత్రం 90 మార్కులు రావడం విశేషం. సర్కారు ఫెయిల్ అయితే సీఎం కేసీఆర్ కు ప్రజలు 90 మార్కులు ఏలా వేశారో సర్వే చేసిన వాళ్లే చెప్పాలి.

రెండున్నరేళ్ల టీఆర్ఎస్ సర్కారు పాలన రెండు అడుగుల ముందుకు నాలుగడుగులు వెనక్కు అనేలా తయారైంది.ఏ పని చేపట్టినా వైఫల్యాలు, అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. వాటిని అధిగమించి సరైన దారిలో నడవాలన్న సృహ కూడా సర్కారుకు లేకుండా పోయింది. తప్పటడుగులు వేస్తూ తప్పంతా ప్రతిపక్షాల మీద నెట్టడం అలవాటు చేసుకోంది.

సీఎంగా కేసీఆర్ గద్దెనెక్కగానే ఫీజు రీయింబర్స్ మెంట్ స్థానంలో ‘పాస్ట్’ అనే పథకాన్ని తీసుకొచ్చారు. కేవలం తెలంగాణలో చదవుతున్న విద్యార్థులకు మాత్రమే రీయింబర్స్ వెంట్ వర్తించేలా ఈ పథకం రూపొందించారు. కానీ, కోర్టు పాస్ట్ పథకాన్ని కొట్టేసింది. ఇది టీఆర్ఎస్ సర్కారు మొదటి ఫెయిల్యూర్ స్టోరీ. ఇక్కడి నుంచి ప్రభుత్వ వైఫల్యాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి.

రాష్ట్రంలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎంసెట్ పరీక్షలోనూ సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఎంసెట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఒకే పరీక్షను నిర్వహించి అభాసుపాలైంది. ఇప్పటి వరకు ఎంసెట్ పేపర్ లీకేజీలో నిందితులు ఎవరో గుర్తించకపోవడం గమనార్హం.

ఇది టీఆర్ఎస్ సర్కారు రెండో ఫెయిల్యూర్ స్టోరీ.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011 లో గ్రూప్1 పరీక్ష నిర్వహించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో దాన్ని మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వేరేవేరుగా ఒకే రోజు పరీక్షలు నిర్వహించాయి. ఏపీ ప్రభుత్వం అప్పుడే ఫలితాలు విడుదల చేసింది. కానీ, 6 నెలలు దాటిన తెలంగాణ సర్కారు ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించలేదు.

ఇది టీఆర్ఎస్ సర్కారు మూడో ఫెయిల్యూర్ స్టోరీ.

ఇక గ్రూప్ 2 పరిస్థితి మరీ దారణంగా తయారైంది. పరీక్షలను మొదట వాయిదా వేసింది. ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్ తో నవంబర్ లో పరీక్షలు నిర్వహించింది. కేవలం 80 రోజుల్లోనే గ్రూప్ 2 భర్తీ ప్రక్రియ పూర్తి స్థాయిలో చేపడుతామని గర్వంగా ప్రకటించింది. కానీ, పరీక్ష నిర్వహించి 4 నెలలు దాటినా ఇప్పటి వరకు ఫలితాలు కూడా ఇవ్వలేకపోయింది. మరోవైపు ఇప్పటికే గ్రూప్ 2 పై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. కోర్టు తీర్పు వచ్చేవరకు ఫలితాల ప్రకటన కూడా కష్టమే అని తెలుస్తోంది.

ఇది టీఆర్ఎస్ సర్కారు నాల్గవ ఫెయిల్యూర్ స్టోరీ.

ఇక టీచర్ అవ్వాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులతో సర్కారు ఆడుకుంటున్న వైనం మరీ దారణం. బీఎడ్ పరీక్షలను ఆలస్యంగా నిర్వహింస్తోంది. టీపీటీ, హెచ్పీటీ లాంటి ప్రవేశ పరీక్షలను ఓ విద్యాసంవత్సరం పూర్తిగా రద్దు చేసింది. దీనికి కారణాలేంటో ఇప్పటికీ చెప్పడం లేదు. మరో వైపు అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ఊసు కూడా లేదు.

ఇటీవల గురుకుల టీచర్ల పోస్టులను భారీ స్థాయిలో భర్తీ చేస్తామని సర్కారు ప్రకటించింది. సవాలక్ష షరుతులు పెట్టి నోటిఫికేషన్ కూడా వేసింది. అయితే అభ్యర్థుల నుంచి కఠిన నిబంధనలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఇప్పటి వరకు కొత్త నోటిఫికేషన్ ఊసే లేదు. ఇప్పట్లో వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

ఇది టీఆర్ఎస్ సర్కారు ఐదవ ఫెయిల్యూర్ స్టోరీ.


భారీ స్థాయిలో పోలీసులు రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే పరీక్ష నిర్వహణపై, ఫలితాలపై, అభ్యర్థుల ఎంపికపై పలు అనుమానాలు వస్తున్నాయి. పరీక్షల్లో

అక్రమాలు చోటు చేసుకున్నాయని అభ్యర్థుల కోర్టుకు వెళ్లడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కోర్టు భర్తీ ప్రక్రియపై స్టే ఇచ్చింది.

ఇది టీఆర్ఎస్ సర్కారు ఆరవ ఫెయిల్యూర్ స్టోరీ.

సింగరేణిలో వారసత్వ కొలువులకు పచ్చజెండా ఊపుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. అయితే దీనిపై సతీశ్ కుమార్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వారసత్వ నియామకాలు చెల్లవని ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు కొట్టేసింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

ఇది టీఆర్ఎస్ సర్కారు ఏడవ ఫెయిల్యూర్ స్టోరీ.

ప్రభుత్వ ఇన్ని సార్లు ఫెయిల్ అయినట్లు స్పష్టంగా తెలుస్తున్నా సీఎం కేసీఆర్ కు మాత్రం 90 మార్కులు రావడం విశేషం. సర్కారు ఫెయిల్ అయితే సీఎం కేసీఆర్ కు ప్రజలు 90 మార్కులు ఏలా వేశారో సర్వే చేసిన వాళ్లే చెప్పాలి.