దీపావళి సెలవు దినానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 25కు బదులు 24నే సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
భారతీయులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే దీపావళి పర్వదినానికి సంబంధించి ఈ వారం కన్‌ఫ్యూజన్ నెలకొంది. కొందరు పండుగ అక్టోబర్ 24 అంటే, ఇంకొందరు అక్టోబర్ 25 అంటున్నారు. దీనికి తోడు మధ్యలో సూర్యగ్రహణం రావడంతో పండుగ ఏ రోజు జరుపుకోవాలో తెలియక ప్రజలు ఆయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీపావళి సెలవును అక్టోబర్ 25 నుంచి 24కు మారుస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గతంలో సెలవుల జాబితాలో వున్న తేదీని మారుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు అక్టోబర్ 24వ తేదీనే పండుగ జరుపుకోవాలని పలువురు వేద పండితులు కూడా చెబుతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. సాధారణంగా దీపావళిని అమావాస్య వేళ సూర్యాస్తమయ్య వేళల్లో నిర్వహిస్తారు. 25వ తేదీన అమావాస్య వున్నప్పటికీ, సాయంత్రం 4.25 గంటలకు అమావాస్య ముగిసి పాడ్యమి ప్రారంభమవుతుంది. అయితే 24వ తేదీన మాత్రం.. సాయంత్రం 4.25 గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది. దీంతో 24వ తేదీనే దీపావళిని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
