హైదరాబాద్:  తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి విద్యా సంస్థల ప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుండి విద్యాసంస్థలు మూసివేశారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 9వ తరగతి నుండి  ఆ పై తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించింది.

రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఆయా తరగతుల క్లాసులు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది మార్చి మాసంలో కరోనా కేసులు పెరగడం ప్రారంభం కావడంతో స్కూల్స్ ను రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది. టెన్త్ తో పాటు ఇతర పరీక్షలను కూడ ప్రభుత్వం నిర్వహించలేదు. విద్యార్ధులను పాస్ చేయించింది.

ప్రస్తుతం ఆన్ లైన్ లోనే ఎక్కువగా విద్యార్ధులు పాఠాలు వింటున్నారు. ఫిబ్రవరి 1 నుండి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

రాష్ట్రంలో స్కూల్స్ రీ ఓపెన్ చేసే విషయమై రాష్ట్ర విద్యాశాఖ రూపొందించిన నివేదికపై సీఎం కేసీఆర్ సోమవారం నాడు  చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, స్థానిక పరిస్థితులను సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.

సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే ఈ నెల 18వ తేదీ లేదా 20వ తేదీ నుండి తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కరోనా వ్యాక్సినేషన్ కూడా ప్రారంభం కానుంది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో తరగతులు ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.