హైదరాబాద్: ఇంటర్ పరీక్ష ఫలితాలపై  త్రిసభ్య కమిటీ గ్లోబరీనా సంస్థ తీరును తప్పుబట్టిన నేపథ్యంలో మరో స్వతంత్ర సంస్థతో కూడ ఇంటర్ రీ వాల్యూయేషన్‌ను చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఇంటర్ పరీక్ష ఫలితాల విషయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదిక లో గ్లోబరీనా సంస్థ తప్పులను కూడ ఎత్తి చూపింది.

ఇదిలా ఉంటే ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన సుమారు మూడులక్షలకు పైగా విద్యార్థుల జవాబు పత్రాలను రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ చేస్తున్నారు. ఈ తరుణంలో గ్లోబరీనా సంస్థపై ఆరోపణలు వచ్చిన తరుణంలో అదే సంస్థకు ఈ పనులు  అప్పగిస్తే ఫలితం ఉండదని సర్కార్ భావించింది.

గ్లోబరీనాతో పాటుగా మరో స్వతంత్ర సంస్థతో కూడ రీ వాల్యూయేషన్ , ఫలితాలను సమాంతరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ రెండు సంస్థలు ఏక కాలంలో  రీ వాల్యూయేషన్,  ఫలితాలను నిర్వహించనున్నాయి గ్లోబరీనా  కాకుండా మరో స్వతంత్ర సంస్థను ఎంపిక చేసే బాధ్యతను  తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీస్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది.