గృహలక్ష్మి పథకం రద్దు ... రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
గత బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఇళ్లనిర్మాణం కోసం తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రేవంత్ సర్కార్ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేేసింది తెలంగాణ సర్కార్.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం సొంత స్థలం కలిగిన పేదలకు ఇళ్ళు కట్టుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం అర్హుల నుండి దరఖాస్తులను కూడా స్వీకరించారు. అయితే ఈ పథకం అమలుకు ముందే అసెంబ్లీ ఎన్నికలు రావడం, అందులో బిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో గృహలక్ష్మి పథకం అమలుపై అనుమానాలు మొదలయ్యాయి.
బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గృహలక్ష్మి ద్వారా కాకుండా కాంగ్రెస్ హామీల్లో భాగమైన అభయహస్తం ద్వారా పేదల ఇళ్లనిర్మాణానికి సాయం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఆరు గ్యారంటీ హామీల అమలుకు అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి అధికారిక జీవో కూడా జారీ చేసారు. ఇందులో ఇప్పటికే గృహలక్ష్మి కింద ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.
గృహలక్ష్మి ద్వారా ఇళ్లు కట్టుకోవాలని ఆశించిన పేదలు ఆందోళన చెందవద్దని... అర్హులైన అందరికీ బిఆర్ఎస్ ప్రకటించిన దానికంటే ఎక్కువ ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. గృహలక్ష్మి కింద సొంత స్థలంలో ఇళ్ళ నిర్మాణానికి బిఆర్ఎస్ రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించింది... కానీ అభయ హస్తం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పేదల ఇళ్ల నిర్మాణంలో గందరగోళం వుండకుండదనే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Also Read Praja Palana: ప్రజా పాలన దరఖాస్తుల గడుపు పొడిగింపు? మంత్రి పొన్నం క్లారిటీ
ఎన్నికల హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ఈ దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఆరు గ్యారంటీ పథకాలకు ఒకే దరఖాస్తు ఫారాన్ని రూపొందించిన ప్రభుత్వం దాన్ని ప్రజలకు అందుబాటులో వుంచింది. దీన్ని ఫిల్ చేసి అధికారులకు ఇవ్వాల్సి వుంటుంది.
కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మీ పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా పథకాల కోసం ప్రజా పాలన దరఖాస్తులు చేసకోవచ్చు. ఒక్కో పథకానికి ఒక్కోసారి దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా ఐదు పథకాల కోసం ఒకేసారి దరఖస్తు చేసుకోవచ్చు. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలు వున్నాయి కాబట్టి గృహలక్ష్మిని రద్దుచేసింది ప్రభుత్వం.