హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రీకరించింది.  ఐఎఎస్ అధికారి సర్పరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.  తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో  ఆక్సిజన్ కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది. 'సర్పరాజ్ నేతృత్వంలోని కమిటీ ఆక్సిజన్ కొరత నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. ఈ సిఫారసుల  ఆధారంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. 

రాష్ట్రంలో ప్రతి రోజూ 340 టన్నుల ఆక్సిజన్ సరఫరా డిమాండ్ ఉంది. అయితే ప్రస్తుతం  రోజు 268 టన్నుల  ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఒడిశా నుండి రోడ్డు మార్గంలో ఆక్సిజన్ సరఫరా చేసే సమయంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ ను సరఫరా చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది. స్టీల్ ప్లాంట్ల ద్వారా ఆక్సిజన్ ను రైల్వే వ్యాగన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.  విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ నుండి రెండు రోజుల క్రితం మహారాష్ట్ర కు సరఫరా చేశారు.