కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశం లాక్ డౌన్ లో ఉంది. దేశంలో ఎటువంటి ఉత్పాదక పనులు జరగకపోవడంతో అటు దేశం పైన, ఇటు రాష్ట్రాల పైన అధిక భారం పడుతోంది. సాధారణ పరిపాలనతోపాటుగా కరోనా నివారణ, సహాయక చర్యలు పేద ఎత్తున సాగుతుండడంతో ఆర్థికంగా తీవ్రమైన భారాన్ని మోస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ తన ఆర్ధిక భారాన్ని కొంతలో కొంతైనా తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలను విధించింది.  ఇందుకు సంబంధించి నిన్న రాత్రి నిర్ణయం తీసుకున్నారు. 

ఉద్యోగుల స్థాయినిబట్టి వారి వారి జీతాల్లో కోతను విధించింది. ఐఏఎస్, ఐపిఎస్ స్థాయి ఉద్యోగుల జీతాల్లో 60 శాతం విధించింది. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు(సీఎం తో సహా), ఎమ్మెల్సీల జీతాల్లో 75 శాతం కోతను విధించింది. 

Also Read ఏప్రిల్ 7లోగా తెలంగాణ కరోనా ఫ్రీ: గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్...

పెన్షన్ లలో కూడా 50 శాతం కోతను విధించింది. సన్నకారు ఉద్యోగులైన నాలుగవ తరగతి ఉద్యోగులకు 10 శాతం కొత్త విధించింది. మిగిలిన అన్ని ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోతను విధించింది. 

ఇకపోతే తెలంగాణలో ఆరు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. 

అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ఇద్దరు గాంధి ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాలలో మరణించారు. వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. 

వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నది. 

వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతున్నది..