దళితబంధు: మరో నాలుగు మండలాలు ఎంపిక చేసిన కేసీఆర్ సర్కార్
రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. చింతకాని, తిరుమలగిరి, అచ్చంపేట, చారగొండ, నిజాంసాగర్ మండలాలను ఈ పథకం వర్తింపజేయాలని నిర్ణయం తీసుకొంది సర్కార్.
హైదరాబాద్: రాష్ట్రంలోని మరో నాలుగు మండలాలను దళిత బంధు పథకం అమలు చేయాలని నిర్ణయించినట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. దళిత శాసససభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న నాలుగు మండలాలను ఎంపిక చేసినట్టుగా సీఎం చెప్పారు.
దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమం లా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దళితబంధు పథకం అమలు యొక్క లోతు పాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని ఈ నాలుగు మండలాలను ఎంపిక చేశామన్నారు.
రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్ తో పాటు దళితబంధు ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను సిఎం కెసిఆర్ ఎంపిక చేశారు.
ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైద్రాబాద్ లో సమీక్షా సమావేశాన్ని సిఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తారు.