భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అయితే పైఎగువ నుంచి గోదావరికి వరద తగ్గడంతో.. భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది.

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. దీంతో గత నాలుగైదు రోజులుగా భద్రాచలంలో ఆందోళన నెలకొంది. గంటకు గంటకు గోదావరిలో వరద నీరు పెరగడం ఆందోళనకు గురిచేసింది. దీంతో భద్రాచలంలోని పలు కాలనీలు వరదలో మునిగిపోయాయి. కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్‌ నగర్‌ కాలనీ, అశోక్‌ నగర్‌, శాంతి నగర్‌ కాలనీ, రామాలయం ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. అయితే ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. 

గత అర్ధరాత్రి సమయంలో గోదావరిలో నీటి మట్టం గరిష్టంగా 71.30 అడుగులకు చేరింది. అయితే తర్వాత నుంచి వరద ఉధృత్తి తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి గోదావరికి వరద ఉధృతి తగ్గడంతో.. ఉదయం 6 గంటల సమయంలో భద్రాచలం వద్ద నీటి మట్టం: 71.10 అడుగులకు చేరింది. అయితే మధ్యాహ్నం వరకు గోదావరిలో వరద ఉధృతి మరింతగా తగ్గింది. మధ్యాహ్నం రెండు గంటలకు గోదావరిలో నీటి మట్టం 70 అడుగుల దిగువకు చేరింది. సాయంత్రం 4 గంటలకు గోదావరిలో నీటి మట్టం.. 69.40 అడుగులుగా ఉంది. 23,40,276 క్యూసెక్కుల నీరు కిందకు ప్రవాహిస్తుంది. ప్రస్తుతం భద్రాచంలో మూడో ప్రమాద హెచ్చరిక (53 అడుగుల నీటి మట్టం వద్ద) కొనసాగుతూ ఉంది. ఇంకా భద్రాచలంలోని చాలా కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. ఇక, గోదావరి వరదల నేపథ్యంలో.. భద్రాచలం నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అక్కడ గోదావరిలో నీటిమట్టం, చేపట్టిన సహాయక చర్యల వివరాలను ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడూ చేరవేస్తున్నారు. ఈ రోజు ఉదయం గోదావరి నది వద్ద వరద ఉధృతిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి ఉదృతి శాంతించాలని కోరుతూ కరకట్ట వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే భద్రాచలంలో గోదావరి వరదలు, ప్రభుత్వం చేపడుతున్న సహయక చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. వైద్య, ఆరోగ్య, ఆర్ అండ్ బీ, విద్యుత్, మిషన్ భగీరథ, పోలీస్, ఇరిగేషన్, సింగరేణి, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

అయితే గోదావరిలో వరద ఉధృతి ఇంకా డేంజర్ లెవల్‌లోనే ఉన్నందున అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా వరద నీటితో ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉంటే.. భద్రాచలంలో వరద బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. శనివారం ఉదయం సుభాష్‌ నగర్ కాలనీ వరద బాధితులు ఆందోళనకు దిగారు. సుభాష్ నగర్‌ వరకు కరకట్ట పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. గోదావరి వరదలతో 2 వేల కటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీగా వరదలు వస్తాయని అధికారులు ముందే హెచ్చరించలేదని వారు చెబుతున్నారు. తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కరకట్ట పొడిగింపుపై హామీ ఇచ్చే వరకు ఆందోళన చేస్తామని చెప్పారు. ఎంపీకి, మంత్రికి తమ ఆందోళన కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. 

ఆందోళన నిర్వహిస్తున్న సుభాష్ నగర్‌ వాసులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో చెబుతున్నారు. అయితే కలెక్టర్, మంత్రి వచ్చే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని వరద బాధితులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. బాధితులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. వరద బాధితుల సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.