Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డిలో రైతులు నిరసనలు మరింత ఉద్ధృతం.. కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌ట‌న

Kamareddy: కామారెడ్డి పట్టణ మాస్టర్‌ ప్లాన్‌పై వివాదం మ‌రింత‌గా ముదురుతోంది. రాజ‌కీయంగా ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల దాడి చేస్తుండ‌గా, త‌మ పోరాటాన్ని కొనసాగించాలని రైతు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నిర్ణయించింది.
 

Telangana : Farmers' protests intensifie in Kamareddy; Farmers' Joint Action Committee announces action
Author
First Published Jan 8, 2023, 4:58 PM IST

Kamareddy Master Plan: ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు కోసం తమ భూములను సేకరించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని ఏడు గ్రామాల రైతులు ఆదివారం కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. కామారెడ్డి పట్టణ మాస్టర్‌ ప్లాన్‌పై పోరాటాన్ని కొనసాగించాలని రైతు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నిర్ణయించింది. గత 3-4 రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వరుస ధర్నాలు, ఇతర రకాల ఆందోళనలు చేసిన రైతులు ఇప్పుడు తమ నిరసనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా 49 మంది మున్సిపల్‌ కౌన్సిలర్‌లకు జనవరి 9న రిప్రజెంటేషన్‌ సమర్పించనున్నారు. జనవరి 10న విరామం అనంతరం 11న మున్సిపాలిటీ వద్ద రైతులు ధర్నాకు దిగనున్నారు. ప్రతిపాదిత కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు నిర్వహిస్తున్నారు.

మాస్టర్‌ప్లాన్‌ను సవాల్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. అడ్లూర్, యల్లారెడ్డి, ఎల్చీపూర్, టేక్రియాల్ తదితర గ్రామాల్లో సారవంతమైన వ్యవసాయ క్షేత్రాలను పారిశ్రామిక జోన్‌గా కేటాయించడంలో అధికారుల తీరును తప్పుబట్టారు. 1,210 ఎకరాల వ్యవసాయ భూమిని గ్రీన్‌జోన్‌, ఇండస్ట్రియల్‌ జోన్‌ కింద డ్రాఫ్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ కింద తీసుకొచ్చామని, తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న ఆందోళ‌న‌లో రైతులు నిర‌స‌న తెలుపుతున్నారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాల స్వీకరణకు మున్సిపల్ అధికారులు జనవరి 11 గడువు విధించారు. పారిశ్రామిక జోన్‌పై అభ్యంతరం తెలుపుతూ ఇప్పటికే 500లకు పైగా లీగల్ నోటీసులు పంపినట్లు రైతులు పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

ప్రతిపాదిత గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్ నుండి తమ వ్యవసాయ భూములను మినహాయించాలని డిమాండ్ చేస్తూ, మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గతవారం పయ్యావుల రాములు (40) అనే రైతు తన భూమి పోతుందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడడంతో వారు నిరసనను తీవ్రతరం చేశారు. కామారెడ్డిలో మృతదేహంతో పాటు కొందరు రైతులు, రాములు బంధువులు నిరసనకు దిగేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లు రైతులకు అండగా నిలుస్తున్నాయి. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు చేపట్టిన నిరసనలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. సంజయ్‌ను అరెస్టు చేసి, తర్వాత విడుదల చేశారు.

మాస్టర్ ప్లాన్ ముసాయిదా దశలో ఉందని, ఏదీ ఖరారు కాలేదని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. 61.55 చదరపు కిలోమీటర్ల మేర మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ దశలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ స్పష్టం చేశారు. 60 రోజుల్లో వచ్చిన సూచనలు, అభ్యంతరాల ఆధారంగా అవసరమైన సవరణల అనంతరం తుది మాస్టర్‌ప్లాన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. రైతుల అభ్యంతరాలను అధికారులు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక జోన్‌లోని వ్యవసాయ భూములను ముసాయిదా మాస్టర్ ప్లాన్‌లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి పట్టణం శుక్రవారం సంపూర్ణ బంద్‌ను పాటించింది. అయితే,  పోలీసులు రైతుల పిలుపుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్, బీజేపీ నాయకులను అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios