మునుగోడు ఉపఎన్నికలో నకిలీ మద్యం సరఫరా: ఒడిశాలో లిక్కర్ బాట్లింగ్ యూనిట్ గుర్తింపు
మునుగోడు ఉప ఎన్నికల్లో నకిలీ మద్యం సరఫరాపై ఎక్సైజ్ శాఖాధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒడిశాలోని నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని గుర్తించారు.ఈ కేసులో ఐదుగురిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నకిలీ మద్యం సరఫరాపై ఎక్సైజ్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒడిశాలో నకిలీ మద్యం కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రంలో తెలంగాణ ఎక్సైజ్ అధికారులతో పాటు ఒడిశా ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నకిలీ మద్యానికి సంబంధించి ముడిపదార్ధాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. నకిలీ మద్యానికి సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నకిలీ మద్యం విక్రయాలు సాగుతున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు . హయత్ నగర్, పెద్ద అంబర్ పేట, మొండి గౌరెల్లి, దేవలమ్మ నాగారం ప్రాంతాల్లో నకిలీ మద్యం విక్రయాలు సాగుతున్నాయనే విషయమై ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ అధికారులు సాగించిన సోదాల్లో కీలక విషయాలను గుర్తించారు. గౌరెల్లికి చెందిన వ్యక్తి సమాచారం మేరకు ఒడిశా రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఎక్సైజ్ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు.
నకిలీ మద్యం కేసులో ఇప్పటికే ఒక వైన్ షాపు లైసెన్స్ ను రద్దు చేశారు ఎక్సైజ్ శాఖాధికారులు. ఒడిశాలోని అక్రమ బాట్లింగ్ యూనిట్ ను ఎక్సైజ్ శాఖాధికారులు గుర్తించారు. ఇక్కడ నకిలీ మద్యానికి సంబంధించిన ముడి సరుకుతో పాటు వందల లీటర్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఈ నకిలీ మద్యాన్ని భారీగా సరపరా చేశారని ప్రచారం సాగుతుంది.
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మద్యం విపరీతంగా వినియోగించే అవకాశం ఉన్నందున నకిలీ మద్యాన్ని సరఫరా చేశారని అనుమానిస్తున్నారు. నకిలీ మద్యం సరఫరాకు సంబంధించి నిందితులకు ఎవరు సహకరించారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. హయత్ నగర్ కేంద్రంగా నకిలీ మద్యం సరఫరా సాగిస్తున్నారని అధికారులు గుర్తించారు. నకిలీ మద్యానికి సంబంధం ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి ఒడిశాలోని నకిలీ బాట్లింగ్ యూనిట్ ను ఎక్సైజ్ శాఖాధికారులు ధ్వంసం చేశారు. ఎంత కాలం నుండి నకిలీమద్యం సరఫరా చేస్తున్నారనే విషయమై ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖాధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు.ఈ సమాచారం ఆధారంగా ఎక్సైజ్ శాఖాధికారులుదర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అంతర్గతంగా విచారణ నిర్వహిస్తున్నారు.