గ్రేటర్ హైదరాబాద్ లోని రాయలసీమ వాసులు.. తమ మద్దతు టీఆర్ఎస్ పార్టీకేనని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. టీఆర్ఎస్ నేతలకే  తమ ఓటు అని తెలంగాణలోని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్  సభ్యులు తెలిపారు.

హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ప్రాంతాలకు చెందిన తమపై టీఆర్ఎస్ ప్రభుత్వ ఎలాంటి వివక్ష చూపించలేదని వారు పేర్కొన్నారు.  ‘‘మహకూటమిలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే.. అన్ని పార్టీల నేతలను అడగాలి.. అదే టీఆర్ఎస్ అయితే.. సింగిల్ పార్టీ.. కేసీఆర్ సొంతంగా ఏ నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉంది. పనులు త్వరగా జరుగుతాయి. అందుకే తమ మద్దతు టీఆర్ఎస్ కే ’’ అని రాయలసీమ వాసులు స్పష్టం చేశారు.

విశ్రాంత న్యాయమూర్తి పి లక్ష్మణ్ రెడ్డి, విశ్రాంత ఐపీఎస్ అధికారి హనుమంత రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ లోని రాయలసీమ వాసులు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో లా అండ్ ఆర్డర్స్ మెరుగ్గా ఉన్నాయని వారు అన్నారు. ఏపీలో కనీసం ప్రతిపక్ష నేతకు కూడా రక్షణ లేకుండా పోయిందని వారు అభిప్రాయపడ్డారు.