Asianet News TeluguAsianet News Telugu

ఆడవాళ్ల హవా.. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మంది మహిళలు గెలుపొందారంటే..? 

Telangana elections 2023: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం అనూహ్యం తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల ఓటర్లు మహిళలకు పట్టం కట్టారు. గెలిచిన ఈ పది మందిలో నలుగురు తొలిసారి ఎన్నికల్లో గెలుపొంది అసెంబ్లీలో అడుగుబెట్టబోతున్నారు. ఇంతకీ ఆ పది మంది మహిళ ఎమ్మెల్యేలెవరు? వారి ఎక్కడి నుంచి బరిలోనిచ్చారు? మీ కోసం..   

Telangana elections 2023 How Many Women Were Elected as MLA KRJ
Author
First Published Dec 5, 2023, 3:53 AM IST

Telangana elections 2023: ఉత్కంఠభరితంగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎవరూ ఊహించిన విధంగా తెలంగాణ ప్రజలు తీర్పు నిచ్చారు. గత పదేండ్లు అధికారంలో ఉన్న ఉద్యమ పార్టీ  బీఆర్ఎస్ గద్దె దించారు. అధికార పగ్గాలను కాంగ్రెస్ కు అప్పగించారు. ఈ తరుణంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఎన్నాడు లేని విధంగా ఈ సారి మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది.  తొలిసారి రెండంకెల సంఖ్యలో మగువలు విజయం సాధించారు. తమ గొంతుకను వినిపించడానికి అసెంబ్లీ లో కాలుపెట్టనున్నారు. 

ఈ ఎన్నికల్లో 119 స్థానాల నుంచి 221 మంది మహిళలు పోటీ చేశారు. ప్రధాన పార్టీల విషయానికి వస్తే..  అత్యధికంగా బీజేపీ నుంచి 13 మంది మహిళలు, కాంగ్రెస్‌ నుంచి 12 మంది, బీఆర్ఎస్ నుంచి 8 మంది, జనసేన నుంచి ఒకరు బరిలో నిలిచారు. కానీ,10 మంది మహిళలు మాత్రమే గెలుపొందారు. గత ఎన్నికలతో పోలిస్తే.. 10 మంది మగువలు అసెంబ్లీ గడప తొక్కనుండడం ఇదే ప్రథమం. ఈ సారి విజయం సాధించిన మహిళల్లో కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు ఉండగా.. బీఆర్ఎస్ నుంచి నలుగురు ఉన్నారు. గెలిచిన ఈ పది మందిలో నలుగురు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అసెంబ్లీలో అడుగుబెట్టబోతున్నారు. ఇందులో ముగ్గురు కాంగ్రెస్‌ నుంచి.. మరొకరు బీఆర్ఎస్ ఉన్నారు. తొలిసారి గెలిచిన నలుగురిలో యశస్విని రెడ్డి, లాస్య నందిత, చిట్టెం పర్ణిక రెడ్డి, మట్టా రాగమయి ఉన్నారు.


తెలంగాణలో ఎమ్మెల్యేలుగా గెలిచిన మహిళలు వీరే.. 

యశస్విని రెడ్డి - పాలకుర్తి

పాలకుర్తిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి .. అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిపదవిలో పనిచేస్తూ ఎర్రబెల్లి దయాకరరావు పోటీ చేసి గెలుపొందింది. ఆమె ఏకంగా 47,634 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 1,26,848 ఓట్లు పోలయ్యాయి. వాస్తవానికి యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి. ఆమె అండతోనే యశస్విని రెడ్డి బరిలో నిలిచారు. 

ఝాన్సీ రెడ్డి ఎన్నారై.. ఆమె తొలుత కాంగ్రెస్ టికెట్ ఆశించింది. కానీ, భారత పౌరసత్వం సమస్య తల్లెత్తుందని టికెట్ నిరాకరించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో ఝాన్సీ రెడ్డి తన కోడలు యశస్విని రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని కోరగా.. ఆమోదం తెలిపింది కాంగ్రెస్ పార్టీ. యశస్విని భర్త రాజమోహన్ రెడ్డి ఆయన కూడా ఎన్నారై. యశస్విని హైదరాబాద్‌లో బీటెక్ చదువుకున్నారు. వివాహమైన తరువాత ఆమె తన భర్తతో కలిసి అమెరికాలో ఉన్నప్పటికి .. కొన్నాళ్లుగా ఆమె తెలంగాణలోనే ఉంటున్నారు.ఈ గెలుపుతో యశస్విని రెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

లాస్య నందిత - సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ)

సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ) నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన  లాస్య నందిత(36) తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత శ్రీగణేశ్‌పై 17,169 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేశారు. కానీ, ఆమె ప్రభావం చూపలేకపోయింది. ఇదిలా ఉంటే.. లాస్య నందిత ఎవరొ కాదు.. ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సేవలందించిన సాయన్న కూమార్తె.. తండ్రి  సాయన్న మరణంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఆమెకు  గతంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవముంది. ఈ విజయంలో లాస్య నందిత తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది.  
 

చిట్టెం పర్ణిక రెడ్డి - నారాయణపేట

నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చిట్టెం పర్ణిక రెడ్డి(30) తన సమీప అభ్యర్థిపై 7,951 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసినా ఆమె   రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు.ఆమె తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా.. గతంలో జరిగిన మావోయిస్టుల దాడిలో నర్సిరెడ్డి, ఆయన రెండో కుమారుడు వెంకటేశ్వరరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈ వెంకటేశ్వర రెడ్డి కుమార్తెనే ఈ పర్ణిక రెడ్డి. 

మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.. పర్ణిక కు స్వయాన పెద్దనాన్న. గతంలో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే, ఆ తరువాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికలలో రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయగా పర్ణిక రెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అయితే.. ఈ ఎన్నికల్లో రామ్మోహన్ రెడ్డి ఓటమి పాలు కాగా.. పర్ణిక గెలుపు బావుటను ఎగరవేశారు. మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. పర్ణిక రెడ్డి మేనత్త డీకే అరుణ. 

 మట్టా రాగమయి - సత్తుపల్లి

సత్తుపల్లి(ఎస్సీ) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా  బరిలో నిలిచిన 52 ఏళ్ల మట్టా రాగమయి తన సమీప ప్రత్యార్థి 19,440 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  ఆమె వైద్యురాలిగా సత్తుపల్లి ప్రజలకు సేవాలందిస్తూ.. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆమె భర్త దయానంద్ సత్తుపల్లిలో కౌన్సిలర్‌గా పనిచేశారు. కాగా.. గత మూడుసార్లుగా సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకటవీరయ్యపై ఆమె పోటీ చేసి విజయం సాధించారు.  

కొండా సురేఖ - వరంగల్ ఈస్ట్

కొండా సురేఖ.. పరిచయం అవసరం లేని రాజకీయ నాయకురాలు.. ఆమె వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో 15,652 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గతంలో ఆమె... శాయంపేట, పరకాల, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. ఆమెకు ఇది నాలుగో విజయం. కొండా సురేఖ గతంలో వైఎస్ఆర్ క్యాబినెట్ లో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికలలో ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావుపై 15,652 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  
 
 సబితా ఇంద్రారెడ్డి - మహేశ్వరం

సబితా ఇంద్రారెడ్డి .. మహేశ్వరంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్‌పై 26,187 ఓట్ల తేడాతో గెలిచారు. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి గెలుపొంది.. అనంతరం 2019లో బీఆర్ఎస్‌లో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోం మంత్రిగానూ, గనుల శాఖ మంత్రిగా  సేవలందించారు. 2019లో బీఆర్ఎస్‌లో చేరిన ఆమెకు కేసీఆర్ కేబినెట్ చోటు లభించింది. ఆమె విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 

 
సునీత లక్ష్మారెడ్డి - నర్సాపూర్

సునీత లక్ష్మారెడ్డి .. నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత ఆవుల రాజిరెడ్డిపై 8,855 ఓట్ల తేడాతో గెలిచారు. ఆమె గతం (1999,2004, 2009)లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో  మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 2014, 2018లలో నర్సాపూర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఫలితంగా లేకుండా పోయింది. ఈ రెండు దఫాలు ఓడిపోయింది. ఆ తరువాత 2019లో ఆమె బీఆర్ఎస్‌లో చేరారు.  

నలమాడ పద్మావతి రెడ్డి - కోదాడ

నలమాడ పద్మావతి రెడ్డి .. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆమె తన సమీప అభ్యర్థి బీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్‌పై 58,172 ఓట్ల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. పద్మావతి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన  ఈఎన్నికలలో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆమె 2014లో తొలిసారి కోదాడ నుంచి పోటీ గెలిచారు. ఆ తరువాత 2018లో హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అనంతరం ప్రస్తుత ఎన్నికలలో రెండోసారి విజయం సాధించారు.

సీతక్క - ములుగు

సీతక్క (అనసూయ) .. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా లీడర్.. ఆమె ఈ ఎన్నికల్లో ములుగు(ఎస్టీ) నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీతక్క విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోసారి తన గెలుపు బావుటాను ఎగురవేశారు. ఆమె గతంలో 2009లో టీడీపీ నుంచి 2018 లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు.కోవిడ్ మహమ్మారి సమయంలో సీతక్క తన నియోజకవర్గంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కాలినడకన వెళ్లి సరకులు అందించారు.  
  
కోవా లక్ష్మి - ఆసిఫాబాద్

ఈ ఎన్నికల్లో కోవాలక్ష్మి ఆసిఫాబాద్(ఎస్టీ) నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరుఫున పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆజ్మీరా శ్యామ్‌పై 22,799 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇంతకుముందు.. ఆమె 2014లో గెలిచినా.. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆమె కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గానూ పనిచేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios