Asianet News TeluguAsianet News Telugu

Telangana Election Results : క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్.. మరి సీఎం ఎవరు?

తెలంగాణలో తొలి రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరవుతారనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్సుకతను రేపుతోంది. ముఖ్యమంత్రి పదవి రెడ్డి సామాజిక వర్గానికా? ఎస్సీ సామాజికవర్గానికా అనే చర్చ నడుస్తోంది. 

Telangana Election Results : Congress towards clean sweep, who is the CM? - bsb
Author
First Published Dec 3, 2023, 9:17 AM IST

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెసే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ నిర్థారించాయి. దీన్ని పోస్టల్ బ్యాలెట్ నిరూపిస్తోంది. మొత్తం ఫలితాలు వెలువడడానికి కొద్ది గంటల సమయమే మిగిలిఉంది. ఎగ్జిట్ పోల్స్ జోస్యం నిజమవుతోంది. ఆధిక్యంలో కాంగ్రెస్ జోరుగా ఉంది. తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ తన అధికారాన్ని దక్కించుకోబోతోంది. కాంగ్రెస్ గెలిస్తే మెజారిటీతో అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? 

సీఎం అభ్యర్థి మీద ఇంత చర్చ ఎందుకంటే.. కాంగ్రెస్ లో డెమొక్రసీ ఎక్కువ. అక్కడ అందరు నేతలూ ముఖ్యమే. సీనియర్లందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. అందుకే కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ లో పదిమంది ముఖ్యమంత్రులు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సీఎం రేస్ లో  రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ పేర్లు కూడా ఎన్నికలకు పది రోజుల ముందు వరకు బాగా వినిపించాయి. ఆ తరువాత ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు రెండు మాత్రమే అది రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క. ప్రచారంలోనూ ఎక్కువగా వీరిద్దరి ఫొటోలే కనిపించాయి. మీడియా కూడా వీరిద్దరి చుట్టూ ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా అనిపించింది. 

Telangana Election Result 2023 : గజ్వేల్ లో తొలి రౌండ్ లో కేసీఆర్ ఆధిక్యం..

మరో వాదన ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ముఖ్యం ముఖ్యమంత్రి ఎవరనేది ఆ తరువాత ఆలోచించాలని అధిష్టానం ఆదేశించిందని. ఈ నేపథ్యంలో కర్ణాటక మోడల్ ఇక్కడ తెలంగాణలోనూ అమలవుతుందన్న మాట వినిపిస్తుంది. అందరికీ ఆమోదయోగ్యుడైన సౌమ్యుడిని ముఖ్యమంత్రిగా.. పార్టీ గెలుపుకు కారణమైన యువనేతను ఉపముఖ్యమంత్రిగా చేస్తారని వినిపిస్తోంది. 

ముఖ్యమంత్రి అనగానే రెడ్డి సామాజిక వర్గానికా? ఎస్సీ సామాజికవర్గానికా అనే చర్చ కూడా నడుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి చేస్తే గడిచిన 50యేళ్లలో దళిత ముఖ్యమంత్రిగా ఎవ్వరూ లేరు. ఆ ఘనత కాంగ్రెస్ సాధించినట్టవుతుంది. మరోసారి కాంగ్రెస్ చరిష్మా పెరుగుతుంది. 

ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి అన్నప్పుడు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహలు కనిపిస్తారు. వీరిద్దరిలో మళ్లీ భట్టి విక్రమార్కకు ఎక్కువ అవకాశాలున్నాయి. కారణం ఆయన సౌమ్యుడు. అందరినీ కలుపుకుపోతారు. దుందుడుకు కాదు. పార్టీకి అత్యంత నమ్మకస్తుడు. ఇప్పుడు సీఎల్పీ లీడర్ గా ఉన్నారు. వివాదాలకు పెద్దగా పోరు. పార్టీకోసం 13వందల కి.మీ. పాదయాత్ర చేశారు. లాంటివి ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదే సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహ కూడా సీనియర్ నేత. గతంలో ఉపముఖ్యమంత్రిగా చేశారు. 

రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే ముందు వినిపించే పేరు రేవంత్ రెడ్డి. ఆ తరువాత వరుసలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఉన్నారు. వీరిలో రేవంత్ రెడ్డి ముందు నుంచి పార్టీలో లేడు ఇది ఆయనకు మైనస్ అవుతుంది. ఓటుకు నోటు కేసులో బెయిల్ మీద ఉన్నాడు. ముఖ్యమంత్రి అనగానే ఈ కేసు బైటికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అగ్రనేతల్లో రేవంత్ మీద అసహనం ఉంది. ఆయనకు సొంతపార్టీలోనే శత్రువులు ఎక్కువగా ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చి టీపీసీసీ చీఫ్ అవ్వడం కూడా ఎవ్వరికీ ఇష్టం లేదు. 

కానీ, చురుకైన నేత.. కేసీఆర్ లాంటి వాడిని ఎదుర్కోవాలంటే ఆ ఎత్తులు, పైఎత్తులు తెలిసిన.. అగ్రెసివ్ గా ఉండగలిగిన నేత రేవంత్ రెడ్డే. ఇదే భావనతోనే కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనను టీపీసీసీ ప్రెసిడెంట్ గా చేసింది. ఆ తరువాతే పార్టీ పుంజుకుందన్న అభిప్రాయం హైకమాండ్ లో ఉంది. దీనివల్ల రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

జానారెడ్డి వివాదరహితుడు, అందరితో కలుపుకుపోతాడు. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నారు. పార్టీకోసం నిరంతరం కష్టపడతారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వివాదరహితుడు. రెండుసార్లు పీసీసీ చీఫ్ గా పనిచేశారు. దీనికి తోడు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. చివరగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈయన కాస్త దుందుడుకు స్వభావం కలిగిన నేత.  సీనియర్ నేత కావడం, ఎన్ని ప్రలోభాలొచ్చినా పార్టీనే నమ్ముుని ఉండడం ప్లస్ అవుతుంది.

బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి కూడా మధుయాస్కీ గౌడ్, సీతక్క, షబ్జీర్ అలీల పేర్లు వినిపించాయి. అయితే, దీనిమీద ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పెదవి విప్పలేదు. తాను పార్టీకి పనిచేశానని, అధికారం కోసం అర్రులు చాచలేదని, హైకమాండ్ ఏది చెబితే అది శిరోధార్యం అన్నారు. మరోవైపు పోలింగ్ నాటికే ఇవన్నీ మబ్చు తెరల్లా విడిపోయాయి. రెండు ఆప్షన్లు మాత్రమే మిగిలాయి. రేవంత్ రెడ్డా? భట్టి విక్రమార్కనా? మరి అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న ఎవరు ప్రమాణస్వీకారం చేస్తారో వెయిట్ అండ్ సీ. 

అయితే, ఇక్కడ చివరగా చెప్పాల్సింది ఏంటంటే.. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డినో, భట్టి విక్రమార్కనో చూసి ఓటు వేయలేదు. కాంగ్రెస్ ను చూశారు. రాహుల్ గాంధీలో వచ్చిన మార్పును, ఆయన ప్రజల్లో కలిసిపోతున్న తీరును చూశారు. మొత్తంగా చెప్పాలంటే మార్పు కావాలనుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios