తెలంగాణ అసెంబ్లీ రద్దవ్వడం.. ముందస్తు ఎన్నికలు వస్తుండటంతో..  రాష్ట్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ సమావేశమయ్యారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై అవగాహాన కార్యక్రమం నిర్వహించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇకమీదట ఈవీఎంలకు తప్పనిసరిగా వీవీప్యాట్‌లను అమర్చాల్సి ఉన్నందున.. వీటిపై అవగాహన కల్పించేందుకు దశలవారీగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే.. అందుకు సిద్ధంగా ఉండాలని...ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు రజత్ కుమార్ సూచించారు.

అలాగే ఎన్నికల వ్యయం, ఓటర్ల జాబితా, అవసరమైన సామాగ్రి, సిబ్బందికి సంబంధించిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి కొత్త మెషిన్లు వస్తాయని వీటిని తొలి దశలో పరిశీలించి అనంతరం సిబ్బందికి శిక్షణా కార్యక్రామలు నిర్వహిస్తామని ఈసీ తెలిపారు. తాను ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉందని.. అయితే కొన్ని కారణాల వల్ల దానిని సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు రజత్ కుమార్ వెల్లడించారు.