Asianet News TeluguAsianet News Telugu

మీ సక్కదనమే బాలేదు.. మమ్మల్ని అంటారా?

  • దక్షిణ భారతదేశంలో నిరక్షరాస్యతలో తెలంగాణ నెంబర్ 1
  • 40వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 4ఏళ్లలో ఎన్ని నింపిర్రు
  • 4వేల స్కూళ్లు మూసివేసిన ఘనత మీకే దక్కుతుంది
  • కేంద్రంపై నిందలు వేయడం సమంజసమా?
Telangana education system is in tatters says BJP president Laxman

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని ఇవ్వడం లేదని కడియం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నిరక్షరాస్యత లో దక్షిణాదిలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉండడం టిఆర్ఎస్ సర్కారు గొప్పతనం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం ఖాళీలు పూరించలేని రాష్ట్ర సర్కారు కేంద్రంపై విమర్శలు చేయడం చూస్తే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు.

తెలంగాణలో 5000 వేల పాఠశాలలు విలీనం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. స్కూళ్ల మూసివేత వల్ల పేద పిల్లలు చదువుకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 వేల కు పైగా  టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా నాలుగేళ్ల కాలంలో ఇప్పటి వరకు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోవడం బాధాకరమన్నారు. పైగా డిఎస్సీ గురించి అసెంబ్లీ లో అడిగితే ప్రపంచం మునిగిపోతదా అన్న ముఖ్యమంత్రి కేసిఆరే నని గుర్తుంచుకకోవాలన్నారు. మీరు అట్టహాసంగా ప్రారంభించిన గురుకులాల లో కనీస వసతులు లేవని గుర్తించాలన్నారు. అన్ని యూనివర్సిటీల్లో ఆచార్యులు లేని, టీచర్లు లేని దుస్థితిలో రాష్ట్ర సర్కారు ఉందన్నారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహించలేని దుస్థితిలో విద్యాశాఖ ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

నేతి బీరకాయ లో నెయ్యి లాగా మంత్రి కడియం మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు.. రాష్ట్ర ప్రభుత్వం లొంగి పోయిందని విమర్శించారు. అధికార పార్టీ నాయకులే ప్రభుత్వ విద్యా విధానానికి ఇబ్బందులు కల్పిస్తున్నారని ఆరోపించారు. గిరిజన విశ్వవిద్యాలయం కోసం.. కనీసం జాగా ఇవ్వకుండా, డిపిఆర్ ఇవ్వకపోవడం తో.. ఇలాంటి దుస్థితి తలెత్తిందన్నారు.

పంచాయతీ వ్యవస్థ  ను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఒక్క రూపాయి కూడా సర్పంచ్ ల కు ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను సైతం పక్క దారి పట్టించారని మండిపడ్డారు. పంచాయతీలకు పరోక్ష ఎన్నికలు అనేది ఒక తిరోగమన చర్య అని విమర్శించారు. పంచాయతీలు తమ చేతుల్లో ఉండాలని.. ఆదరా బాదరాగా చేస్తున్న నిర్ణయంగా అభివర్ణించారు.

నాగం ..బిజెపికి గుడ్ బై అనేది ప్రచారం మాత్రమే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అవుతుందనడం  భ్రమ మాత్రమే అన్నారు. తెలంగాణలో బీజేపీ కే భవిష్యత్ ఉందని జోస్యం చెప్పారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రాజీనామా ను అంగీకరించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ సర్కారును కేంద్ర మంత్రులు పొగిడారు అనేది సరికాదన్నారు. వారు మాట్లాడింది ఒకటైతే... పత్రికల్లో వచ్చేది  వేరే రకంగా ఉంటోందని పేర్కొన్నారు. హజ్ సబ్సిడీ ఏజెంట్లకు మాత్రమే లాభం చేకూరుస్తోందన్నారు. ఆ డబ్బును ముస్లిం బాలికల చదువుకు కేంద్రం ఖర్చు పెడుతోందని తెలిపారు. దీనిపై ఎంఐఎం నేత ఒవైసి ఎందుకు ఇప్పుడు మాట మార్చారని ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios