ఢిల్లీ: తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌తో భేటీ అయిన రజత్ కుమార్ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. సుమారు ఐదు గంటలపాటు వీరి భేటీ కొనసాగింది. కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించినట్లు రజత్ కుమార్ తెలిపారు. 

తెలంగాణలో ఎన్నికల కసరత్తు, సంసిద్దత అంశాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌ ఉమేశ్‌ సిన్హా బృందం తెలంగాణలో పర్యటించిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

మరోవైపు తెలంగాణ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాపై సెప్టెంబర్‌ 25వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొంది. అక్టోబర్‌ 4 వరకు అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్‌ 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.