తెలంగాణలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన భట్టి విక్రమార్క
డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గడిచిన కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గడిచిన కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ఐటీడీఏలో పాలకమండలి సమావేశం జరగలేదన్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని.. త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీలేని రుణాలు అందిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. గత కొంతకాలంగా వేతనాలు ప్రతి నెలా రాక ఇబ్బందులు పడుతున్నామని ఆశా వర్కర్లు తన దృష్టికి తీసుకొచ్చారని .. వారి సమస్యను పరిష్కరిస్తానని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.