మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చి నెగెటివ్ అని తేలిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి పాజిటివ్ వచ్చి ఆ తర్వాత నెగిటివ్ అని వచ్చినప్పటికీ చిరు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.

ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ ఇది తప్పనిసరిగా ఫాలో అవ్వాలని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఏ కరోనా పరీక్ష కూడా నూటికి నూరు శాతం ఖచ్చితత్వంతో రాదని ఆయన పేర్కొన్నారు.

ఒకసారి పరీక్షలో పాజిటివ్ వస్తే, పాజిటివ్ గానే భావించాల్సి వుంటుందని శ్రీనివాసరావు అన్నారు. ఆ తరువాత నెగటివ్ వచ్చినా, లక్షణాలు ఉన్నా, లేకున్నా, క్వారంటైన్‌లో ఉండి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

కాగా చిరంజీవికి కరోనా అన్న వార్తలు ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే రెండురోజుల తరువాత అది టెస్ట్‌లలో సమస్య వలన వచ్చిన పాజిటివ్ రిపోర్ట్ అనీ, మళ్ళీ చేసిన టెస్ట్ లలో నెగెటివ్ వచ్చిందనీ తేలింది.

స్వయంగా ఈ విషయాల్ని చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్‌కు కరోనా పాజిటివ్ అని వార్తలు రావడానికి కొద్దిరోజుల ముందు ఆయన మరో హీరో నాగార్జునతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. దీంతో  వీరంతా ఉలిక్కిపడ్డారు.