తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల  పట్ల జాగ్రత్తగా ఉండాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. అత్యవసరమైతే తప్పు ప్రజలు బయటకు రావొద్దన్నారు. 

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. అత్యవసరమైతే తప్పు ప్రజలు బయటకు రావొద్దన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో డీఎంహెచ్‌వోలతో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డీహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. వాతావరణంలో మార్పులతో సీజనల్‌ వ్యాధులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా తర్వాత డెంగీ కేసులు అధికంగా వస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది డెంగీతో పాటు టైపాయిడ్ కేసులు పెరిగాయని తెలిపారు. 

డెంగీ, మలేరియా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున.. దోమలు వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమలు వాలకుండా చూసుకోవాలన్నారు. తాజా కూరగాయలు, వేడివేడి ఆహారం తీసుకోవాలని అన్నారు. తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. నీటి రంగు మారితే వేడి చేసుకోని తాగాలని సూచించారు. పానీపూరి, బయటి ఫుడ్ తినేటప్పుడు శుభ్రత ఉందో లేదో చూసుకోవాలన్నారు. 

జ్వరం వచ్చినప్పడు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అయితే అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని చెప్పారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. గర్భిణిలు డెలివరీ డేట్ కంటే ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకోవాలని సూచించారు. 

కరోనా ఎండమిక్ దళకు చేరుకుందని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. అన్ని వ్యాధుల మాదిరిగానే కరోనా ఒకటి అని అన్నారు. మాస్క్ కరోనా నుంచే కాదు.. అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు. కరోనా వస్తే 5 రోజులు క్వారంటైన్‌లో ఉంటే చాలని చెప్పారు. వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని.. కరోనా సోకి శ్వాసకోస ఇబ్బందులు ఉన్నవారు ఆస్పత్రిలో చేరాలని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవద్దన్నారు.