సీరో సర్వే ప్రకారం తెలంగాణలో ఫోర్త్‌వేవ్ రాదని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని ప్రజలకు ఆయన సూచించారు. వయసుల వారీగా అర్హత ఉన్నవారు వ్యాక్సిన్‌ తీసుకోవాలని డీహెచ్ తెలిపారు.  

దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు (coronavirus) పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు ఉలిక్కిపడుతున్నాయి. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ తప్పదంటూ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ హెల్త్ (telangana public director) డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు (dh srinivasarao) స్పందించారు. సీరో సర్వే ప్రకారం తెలంగాణలో ఫోర్త్‌వేవ్ (fourth wave) రాదని ఆయన స్పష్టం చేశారు. థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఫోర్త్ వేవ్‌పై అనేక సందేహాలు వున్నాయని డీహెచ్ పేర్కొన్నారు. 

తెలంగాణలో రోజుకు 20-25 కరోనా కేసులు మాత్రమే నమోదవుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ అదుపులోనే వుందని డీహెచ్ స్పష్టం చేశారు. మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని ప్రజలకు ఆయన సూచించారు. తెలంగాణలో కరోనా నిబంధనలు ఎత్తివేయలేదని శ్రీనివాసరావు తెలిపారు. మాస్క్ ధరించకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కొవిడ్‌ పూర్తిగా పోలేదని.. రానున్న మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణలో పాజిటివిటీ రేటు పెరగలేదని.. హైదరాబాద్ మినహా మరెక్కడా 10కి పైగా కేసులు నమోదు కావడం లేదని శ్రీనివాసరావు చెప్పారు. సీఎం గత నాలుగు రోజులుగా కొవిడ్ వివరాలు తెలుసుకుంటున్నారని... ఏప్రిల్, మే, జూన్ వరకు వివాహాలు, విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. 

వస్తుందో రాదో తెలియని ఫోర్త్ వేవ్‌ నుంచి ప్రజలు బయటపడాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిందేనని శ్రీనివాసరావు హెచ్చరించారు. అర్హులైన ప్రతిఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో 106 శాతం జనాభాకు మొదటి డోసు ఇచ్చామని... రెండో డోసు కూడా వంద శాతం మంది తీసుకున్నారని డీహెచ్ వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజల అప్రమత్తత కారణంగా థర్డ్‌ వేవ్‌లో తక్కున నష్టంతో బయటపడ్డామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని డీహెచ్ హెచ్చరించారు. 60 ఏళ్ల పైబడిన వారికి అన్ని ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ కేంద్రాల్లో బూస్టర్‌ డోసు ఇస్తున్నామని.. వయసుల వారీగా అర్హత ఉన్నవారు వ్యాక్సిన్‌ తీసుకోవాలి అని శ్రీనివాసరావు సూచించారు.