తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకి ఎక్కువవుతుంది. తారతమ్యాలు లేకుండా అందరికి సోకుతుంది. నిన్ననే ఉప ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి మహమూద్ అలికి కరోనా సోకినా విషయం తెలిసిందే. మంత్రికి కరోనా సోకి 24 గంటలు కూడా గడవక ముందే... నిన్ననే తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. 

ఆయనతోపాటు ఆయన కుటుంబంలోని మరొఇద్దరు పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతానికి వీరందరిని హోమ్ ఐసొలేషన్ లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన కుటుంబ సభ్యుల సాంపిల్స్ కూడా టెస్ట్ కి పంపించారు. వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. 

మోండా మార్కెట్లోని టక్కర బస్తీలో తన ఉమ్మడి కుటుంబంతో నివసించే పద్మారావు నియోజకవర్గ పరిధిలో కరోనా వైరస్ నేపథ్యంలో అక్కడ ప్రజలకు అవసరమైన అన్ని సహాయక చర్యల్లో భాగంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. 

ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకి ఉండవచ్చని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆయన ద్వారా ఇంట్లో ఆయన ఇద్దరు మనవళ్లకు కూడా కరోనా వైరస్ సోకిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ కరోనా వైరస్ బారిన పడగా తాజాగా మంత్రి మహమూద్ అలీ...కరోనా వైరస్ బారినపడ్డ తొలి మంత్రి అయ్యారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పద్మారావు కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతానికి పద్మారావు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. 

ఇకపోతే.... తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. సోమవారం రాష్ట్రంలో 975 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,394కు చేరింది.

ఇవాళ కోవిడ్ 19 కారణంగా ఆరుగురు మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 253కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 9,559 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 5,582 మంది కోలుకున్నారు.

ఇవాళ ఒక్కరోజే 410 మంది డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోనే సోమవారం 861 మందికి వైరస్ సోకింది. ఆ తర్వాత రంగారెడ్డి 40, సంగారెడ్డి 14, కరీంనగర్ 10, మేడ్చల్ 20, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 4, భద్రాద్రి 8, మహబూబ్‌నగర్ 3, నల్గొండ 2, కామారెడ్డి, యాదాద్రిలో రెండేసి కేసులు, సిద్ధిపేట, ఆసిఫాబాద్, గద్వాల, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.