Asianet News TeluguAsianet News Telugu

నుమాయిష్ అగ్నిప్రమాదం ఎఫెక్ట్: అధికారులతో చీఫ్ సెక్రటరీ సమావేశం

తెలంగాణలో జరిగే ఎగ్జిబిషన్లు, పబ్లిక్ మీటింగులు, వేడుకలు, ఉత్సవాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక, మున్సిపల్, పోలీస్, విద్యుత్  శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సమావేశమయ్యారు. ఇలా  ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాలకు అనుమతి మంజూరు చేయడానికి అవసరమైన ముసాయిదా నిబంధనలను వారంలోగా తయారు చేయాలని ఆయన వారికి ఆదేశించారు. 


 

telangana cs sk joshi meeting with fire, police, municipal, electricity officers
Author
Hyderabad, First Published Mar 20, 2019, 3:39 PM IST

తెలంగాణలో జరిగే ఎగ్జిబిషన్లు, పబ్లిక్ మీటింగులు, వేడుకలు, ఉత్సవాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక, మున్సిపల్, పోలీస్, విద్యుత్  శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సమావేశమయ్యారు. ఇలా  ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాలకు అనుమతి మంజూరు చేయడానికి అవసరమైన ముసాయిదా నిబంధనలను వారంలోగా తయారు చేయాలని ఆయన వారికి ఆదేశించారు. 

నుమాయిష్ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సంభవించిన అగ్నిప్రమాదం నేపథ్యంలో ఆయన సంబంధిత అధికారులతో బుధవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎగ్జిబిషన్లు, వేడుకలు, సమావేశాల అనుమతులకు సంబంధించి స్టాండార్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్ ను రూపొందించాలని సిఎస్ కోరారు. వివిధ శాఖలు అనుమతికి దరఖాస్తు చేయడానికి సింగిల్ అప్లికేషన్ ఫారం ను రూపొందించాలని ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణి, నుమాయిష్ తదితర ఈవెంట్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారని... వీటికి సంబంధించి మోడల్ లేఔట్ ను రూపొందించాలని సూచించారు. 

ఎగ్జిబిషన్లకు వచ్చే సందర్శకులు, ఏర్పాటు చేయవలసిన స్టాళ్ల పై ప్రత్యేక  అవగాహన ఉండాలన్నారు. పర్మనెంట్ భవనాలు, తాత్కాలిక భవనాలు, హైరిస్క్ భవనాలు, పంక్షన్ హాళ్లు తదితర క్యాటగిరిలుగా విభజించి, నిబంధనలు రూపొందించాలన్నారు. నిర్వాహకులు  ఆన్ లైన్ లో ముందుగానే ధరఖాస్తులు సమర్పించేలా నిబంధనలు ఉండాలన్నారు. 

వివిధ వేడుకలు, ఎగ్జిబిషన్లు, సమావేశాలు జరిగేటప్పుడు విద్యుత్, అగ్నిమాపక, మున్సిపల్ తదితర శాఖల అనుమతుల మంజూరుకు క్షేత్రస్ధాయిలో తనిఖీలు ఉండాలన్నారు. అత్యవసర ఎగ్జిట్, ఫైర్ ఇంజన్లు సులభంగా వెళ్లేలా రహదారులు, డ్రైనేజ్, పార్కింగ్, నీటిసదుపాయం, ఇన్సూరెన్స్, ఫైర్ హైడ్రాక్ట్ ఏర్పాటు తదితర అన్ని అంశాలతో లేఅవుట్ ఉండేలా చర్యలు జాగ్రత్తపడాలన్నారు. ప్రజల భద్రత, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 

ముఖ్యంగా  షార్ట్ సర్క్యూట్స్ పై కూడా ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో అనుమతులు ఇచ్చేలా నిబంధనలు ఉండాలన్నారు. పోలీసు కమీషనర్లు, జిల్లా కలెక్టర్లు తగు అనుమతులు మంజూరు చేసేలా నిబంధనలు ఉండాలని ఆదేశించారు.

మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ... భవనాల నిర్మాణ అనుమతులను మంజూరీ లో  లిప్ట్ ల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి నిబంధనలు రూపొందిస్తామన్నారు. క్షేత్రస్ధాయిలో భవనాలను రాండమ్ ఇన్స్‌పెక్షన్  చేస్తామని తెలిపారు. నిబంధనలు రూపొందించాక  వేడుకల నిర్వాహకులతో సమావేశాలు నిర్విహంచి అవగాహన కల్పిస్తామన్నారు. అన్నినిబంధనలు పాటించేలా చూస్తామన్నారు. ముసాయిద నిబంధనల రూపకల్పనలో చట్ట పరంగా ఉన్న అంశాలను దృష్టిలో ఉంచుకుంటామన్నారు. అన్ని అంశాలు కవర్ అయ్యేలా చూస్తామన్నారు. ప్రజల సౌకర్యం, భద్రతే తమకు ముఖ్యమని అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్, పోలీస్ కమీషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్, ఫైర్ సర్వీస్ డిజి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios