హైదరాబాద్: మహాకూటమిలో సీపీఎం పార్టీ కలిసే ప్రసక్తే లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు కలిసి ఏర్పడిన మహాకూటమికి బేస్‌లెస్ లేదని కొట్టిపారేశారు. ముందస్తు ఎన్నికలకు సీపీఎం వ్యతిరేకమన్నారు. కేసీఆర్ స్వలాభం కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మళ్లీ కాంగ్రెస్‌కు వంత పలకటం మూర్ఖత్వం అన్నారు. 

దేశంలో కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ పార్టీయేనని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌తో కలవటానికి తాము సిద్ధంగా లేమన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. 

సామాజిక న్యాయం, చట్టసభల్లో బలహీనులకు అవకాశం కల్పించటమే తమ లక్ష్యమన్నారు. బీఎల్ఎఫ్‌తోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. జనసేన, ఆమ్‌ ఆద్మీలతోపాటు కలిసి వచ్చే పార్టీలతో బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తమది మొదటిది లేదా మూడో ఫ్రంట్ అనుకోవచ్చున్నారు. 
 
బీఎల్‌ఎఫ్‌లో చేరికపై జనసేన ప్రతినిధులతో జరిగిన చర్చల్లో సామాజిక న్యాయం, విద్యా, వైద్యంపై ఒక అంగీకారం కుదిరిందన్నారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీతో జరిగిన చర్చల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా పనిచేయాలని కోరానని తమ్మినేని తెలిపారు. అయితే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే విషయంలో జనసేనకు అభ్యంతరాలున్నాయేమో అని సందేహం వ్యక్తం చేశారు. 

పవన్ కళ్యాణ్‌తో భేటీ కోసం ఐదు రోజులుగా ప్రయత్నిస్తున్నామని ఆయనకు ఆరోగ్యం బాగోలేదని జనసేన ప్రతినిధులు చెప్తున్నారని తమ్మినేని చెప్పారు. రాజకీయ విధానాలు నచ్చకపోతే జనసేన తమతో కలిసి రాకపోవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. జనసేనతోపాటు వివిధ పార్టీలతో చర్చలు పూర్తయ్యక అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 

మరోవైపు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాత కాలపు రాజులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మనుషుల అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ వాళ్లున్నమాట వాస్తమేనన్నారు. 2004 కేసుతో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని టీఆర్ఎస్ చూస్తోందన్నారు. 

న్యాయం, ధర్మం కోసం కేసీఆర్ పనిచేస్తే నయీం కేసు, డ్రగ్స్ దందాలను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. మనుషుల అక్రమ రవాణాలో కేసీఆర్, హరీష్ రావులపై ఎందుకు కేసులు పెట్టలేదన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయటానికే పాత కేసులను కేసీఆర్ బయటకు తీస్తున్నారని వ్యాఖ్యానించారు.