తెలంగాణలో కరోనా కేసుల (Corona Cases) సంఖ్య రోజురోజుకు పెరగడం జనాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ సర్కార్ పలు ఆంక్షలను అమలు చేస్తోంది. తాజాగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణలో కరోనా కేసుల (Corona Cases) సంఖ్య రోజురోజుకు పెరగడం జనాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ సర్కార్ పలు ఆంక్షలను అమలు చేస్తోంది. తాజాగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణతో ప్రభుత్వ ఆస్పత్రులకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర శస్త్రచికిత్సల్లో ఎలాంటి ఆటంకం ఉండదని వెల్లడించింది. 

తాజా ఆదేశాలతో నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేశారు. రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న దృష్ట్యా త్వరలో గాంధీలో ఇప్పటికే జీనోమ్​ సీక్వెన్సింగ్ ఏర్పాటు చేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్​ డాక్టర్​ రాజారావు తెలిపారు. ఒమిక్రాన్​కు కొత్తగా చికిత్స లేదని పేర్కొన్నారు. తప్పక అందరూ కొవిడ్​ నిబంధనలు పాటించాలని కోరారు.

ఇక, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,825 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,95,855కి చేరింది. తాజాగా కరోనాతో ఒకరు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,043కి చేరింది. తాజాగా కరోనా నుంచి 351 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 6,76,817కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 14,995 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 97.26 శాతంగా ఉన్నట్టుగా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 

 కరోనా కొత్త కేసులలో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధి నుంచే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,042, మేడ్చల్ జిల్లాలో 201, రంగారెడ్డిలో 147, సంగారెడ్డిలో 51, హన్మకొండలో 47, మంచిర్యాలలో 38 కరోనా కేసులు నమోయద్యాయి.

ఇక, తెలంగాణ సర్కార్ కోవిడ్ ఆంక్షలను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆంక్షల్లో భాగంగా.. ర్యాలీలు, బహిరంగ సభలు, మతపరమైన, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించింది. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్‌, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారికి తప్పక జరిమానా విధించనున్నట్టుగా తెలిపింది.