కేసీఆర్ టార్గెట్: టీడీపితో కలిసి కాంగ్రెసు మహా కూటమి

Telangana Congress to form grand alliance
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును లక్ష్యం చేసుకుని, అందుకు తగిన వ్యూహాన్ని తెలంగాణ కాంగ్రెసు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని, హైదరాబాదులో ఆంధ్రులకు ఎక్కువ సీట్లు ఇస్తామని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన మీడియాకు పెద్దగా పట్టినట్లు లేదు. దాని ప్రాధాన్యాన్ని మీడియా గుర్తించినట్లు లేదు. పైగా, తమకు అనుకూలంగా వ్యవహరించే మీడియా లేకపోవడమే కాదు, ఉన్న మీడియా ప్రత్యర్థులకు అనుకూలంగా ఉందడడం కాంగ్రెసుకు పెద్ద లోటు. దానివల్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన గాలిలో కలిసిపోయింది. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లోని అంతరార్థం ఏమిటనే ఆలోచన వచ్చేసరికి తెలంగాణ కాంగ్రెసు వ్యూహమేమిటనేది తెలిసి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును లక్ష్యం చేసుకుని, అందుకు తగిన వ్యూహాన్ని తెలంగాణ కాంగ్రెసు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో మహా కూటమి కట్టి కేసిఆర్ ను ఎదుర్కోవాలనే ఆలోచనలో ఉంది. తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుని వెళ్లే ఆలోచన చేస్తోంది. ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉంటే కేసిఆర్ ను ఎదుర్కోవడం సులభమవుతుందనే మార్గంలో వ్యూహంలో వెళ్తోంది. 

టీడీపితో పాటు సిపిఐ, కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జనసమితి (టీజెఎస్)ను కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో కాంగ్రెసు ఉంది. చెరుకు సుధాకర్ నాయకత్వంలోని తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెసుతో కలిసి పనిచేసేందుకు సిద్ధపడింది. 

మహా కూటమి విషయంలో రాహుల్ గాంధీ ఆమోదం పొందిన తర్వాత ముందుకు సాగాలనే ఉద్దేశంతో తెలంగాణ పిసిసి ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. కాంగ్రెసు సిపిఐతో కలిసి పోటీ చేసింది. బిజెపి, టీడీపి కలిసి పోటీ చేశాయి. ఈసారి బిజెపితో కలిసి టీడీపి నడిచే ఉద్దేశంతో లేదు. పైగా, తెలంగాణ బిజెపి తెలంగాణ నాయకులు మొదటి నుంచీ టీడీపి పొత్తును వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

టీడీపితో పొత్తు పెట్టుకుంటే గ్రేటర్ హైదరాబాదు పరిధిలో తమకు కలిసి వస్తుందని తెలంగాణ కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రులకు గ్రేటర్ హైదరాబాదు పరిధిలో ఎక్కువ సీట్లు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు భావించవచ్చు. తెలుగుదేశం పార్టీకి గ్రేటర్ హైదరాబాదు పరిధిలోనే కాకుండా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో తగిన బలం ఉంది. 

loader