ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. జూన్ మొదటి వారంలో తెలంగాణలో చింతన్ శిబిర్ నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. జూన్ మొదటి వారంలో తెలంగాణలో చింతన్ శిబిర్ నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమంలోనే పార్టీ నిర్మాణం, కార్యచరణ, దిద్దుబాటు చర్యలపై సమీక్ష చేపట్టనున్నారు. ఇటీవల రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఏఐసీసీ చింతన్ శిబిర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ తరహాలోనే రాష్ట్రంలో కూడా చింతన్ శిబిర్ నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు పార్టీ కిందిస్థాయి నాయకులను కూడా ఆహ్వానించనున్నారు. చింతన్ శిబిర్ నిర్వహణకు సంబంధించిన వేదికను తొందరలోనే ప్రకటించనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ సభ తర్వాత టీ కాంగ్రెస్ కొత్త జోష్‌తో ముందుకు వెళ్తుంది. వరంగల్ సభలో రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోగా రైతులకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పలు పంటలకు ఎంఎస్‌పీ కల్పిస్తామని చెప్పారు. ‘వరంగల్ డిక్లరేషన్’ను గ్రామాలకు వెళ్లి వివరించాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు సూచించారు. రైతులకు చేసిన 9 వాగ్దానాల కరపత్రం వారి చేతుల్లో ఉండేలా నాయకులు, కార్యకర్తలు చూసుకోవాలని చెప్పారు. ప్రతి యువకుడి చేతిలో కూడా కరపత్రం కనిపించాలన్నారు.
ఈ క్రమంలోనే రచ్చబండ కార్యక్రమానికి టీ కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. మే 21న ప్రారంభించిన రచ్చబండను 30 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు 300 మంది సమన్వయకర్తలను పార్టీ నియమించింది. రానున్న 30 రోజుల్లో తెలంగాణలోని 12,000 గ్రామాలను కవర్ చేయనున్నారు. కోఆర్డినేటర్లు.. వరంగల్ డిక్లరేషన్‌ను ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్లడానికి సమావేశాలను ప్లాన్ చేస్తారు. ఇక, సీనియర్ నేతలందరికీ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను అప్పగించి, వారి భాగస్వామ్యం తప్పనిసరి చేశారు.
