దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ రోజు తెలంగాణ  కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశానికి పలువురు తెలంగాణ ముఖ్య నేతలు హాజరయ్యారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశానికి పలువురు తెలంగాణ ముఖ్య నేతలు హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్వహిస్తోంది. అయితే టీ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల నేపథ్యంలో సమావేశంలో ఏ విధమైన చర్చ జరగనుందనేది హాట్ టాఫిక్‌గా మారింది. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యతిరేక వర్గం నేతలు.. ఈ సమావేశంలో ఆయనను టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ వ్యవహారాలకు సంబంధించి సమన్వయంపై ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలు పట్టుబట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ సమావేశానికి తొలుత కొంతమంది నేతలకే ఆహ్వానం అందినప్పటికీ.. ఆ తర్వాత ఆహ్వానం అందని నేతలు అసంతృప్తికి లోనుకావడంతో ముఖ్య నేతలందరినీ ఈ సమావేశానికి పిలిచినట్టుగా తెలుస్తోంది. 

ఇక, ఈ సమావేశంలో పార్టీ నేతల మధ్య సమన్వయంపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలతో ఖర్గే, రాహుల్, ప్రియాంకలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రాష్ట్ర నేతలకు మార్గనిర్దేశనం చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. కాంగ్రెస్ ప్రజలకు అందించే హామీలపై కూడా ఈ బేటీలో చర్చించనున్నట్టుగా సమాచారం. కర్ణాటక తరహాలోనే తెలంగాణ ప్రజలకు ఐదు హామీలను అందించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.