కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సన్నాహక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్‌లో జరిగే సభకు హాజరు కావడంతో పాటుగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సన్నాహక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వరంగల్‌లో రాహుల్ గాంధీ సభకు భారీగా జనసమీకణ చేయాలని.. ఐదు లక్షల మందితో నిర్వహించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే వరుస సమావేశాలు నిర్వహిస్తూ ప్రణాళికలు రచిస్తోంది.

ఈ క్రమంలోనే శనివారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. జిల్లా నాయకులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ పర్యటనపై చర్చించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2003లో సోనియా సభను తలపించేలా రాహుల్ సభను నిర్వహించనున్నట్టుగా చెప్పారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వరంగల్ సభే పునాది అన్నారు. రాహుల్ గాంధీ సభ 20 ఏళ్ల వరకు గుర్తుండాలన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు రైతు సంఘర్షణ సభ అని చెప్పారు. నేతలకు సమస్యలుంటే తనకు వ్యక్తిగతం చెప్పాలని రేవంత్ అన్నారు. 

ఇక, రాహుల్ గాంధీ సభ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జులను నియమిస్తోంది. నల్లగొండ- గీతారెడ్డి, భువనగిరి- జగ్గారెడ్ది, మహబూబాబాద్- శ్రీధర్ బాబు, కరీంనగర్- షబ్బీర్ అలీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జులను నియమించినట్టుగా సమాచారం. 

ఇక, రాహుల్ గాంధీ తెలంగాణలో మే 6,7 తేదీల్లో పర్యటించనున్నారు. మే 6న మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి వరంగల్‌కు హెలికాఫ్టర్‌లో వస్తారు రాహుల్ గాంధీ. కాకతీయ యూనివర్సిటీకి చేరుకుని ... అక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌కు నిర్వహించే ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఓపెన్ టాప్ వ్యానులో రాహుల్ ర్యాలీ చేపడతారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు రాహుల్ బహిరంగ సభ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 

ఈ సభకు రైతు సంఘర్షణ సభగా నామకరణం చేశారు కాంగ్రెస్ నేతలు. ఓరుగల్లులో రాహుల్ పాల్గొనే సభతో రాష్ట్ర రాజకీయాల్లో వైబ్రేషన్స్‌ ఖాయమని చెబుతున్నారు టీపీసీసీ నేతలు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇప్పటినుంచే రాహుల్‌ సభ కోసం సన్నాహాలు చేస్తున్నారు. బహిరంగ సభా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా రైతులు ఈ బహిరంగ సభకు తరలివస్తారనే అంచనాతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇక, మే 7వ తేదీన రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

ఇక, వరంగల్‌లో జరగనున్న రాహుల్‌ గాంధీ రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను గురువారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ, ఏఐసీసీ నేతలు ఏలేటి మహే శ్వర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు పరిశీలించారు.