సంగారెడ్డి: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి గెలిచి ఉంటే ఎంపీ రేవంత్ రెడ్డి హీరో అయ్యేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతి ఓడిపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి హీరో అయ్యాడని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం అని చెప్పుకొచ్చారు. ఓటమి పాలవ్వడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓదార్చాల్సిన అవసరం లేదన్నారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి అధైర్యవంతుడు కాదన్నారు. ఆయన చాలా ధైర్యవంతుడు కాబట్టి ఓదార్చాల్సిన అవసరం గానీ పరామర్శించాల్సిన అవసరం గానీ లేదని చెప్పుకొచ్చారు. యుద్ధవిమానంలో దేశం కోసం పోరాడిన ఆయనకు ఓటమి సమస్య కాదని చెప్పుకొచ్చారు. అలాకాకపోతే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైందని గుర్తు చేశారు. ఎప్పుడైనా ఉపఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయన్నారు జగ్గారెడ్డి.  

ఇకపోతే సంగారెడ్డి పట్టణంలో పురాతన ఆలయాలు అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పురాతన దేవాలయాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి చర్చించినట్లు చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వ పరంగా పురాతన ఆలయాలకు సీజీఎఫ్ నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో 13 ఆలయాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దేవాలయాల అభివృద్ధికి 3.25 కోట్లు అడిగానని మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు