సంగారెడ్డి: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హల్ చల్ చేసే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గ అభివృద్ధికి లింక్ చేస్తూ చేయడం విశేషం. 

ఇకపై తాను తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడనని చెప్పుకొచ్చారు. వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వబోనని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. అంతేకాదు బీజేపీని సైతం విమర్శించే సాహసం చేయబోనని కూడా తేల్చి చెప్పేశారు. 

సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనేదే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాను బీజేపీ, టీఆర్ఎస్ తో విబేధాలు పెట్టుకుంటే అభివృద్ధి కష్టమేనని చెప్పుకొచ్చారు. 

తాను ఏం మాట్లాడినా, ఎలాంటి ఎత్తుగడ వేసినా అందులో చాలా మర్మం ఉంటుందని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. తన వ్యాఖ్యల్లో గానీ, తన చేతల్లో గానీ ఏమైనా మార్పులు వస్తే అందులో చాలా అర్థం దాగి ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు.