తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని కలవనునున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సాయంత్రం 4 గంటలకు తనను కలిసేందుకు  రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. 

తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని కలవనునున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సాయంత్రం 4 గంటలకు తనను కలిసేందుకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, మధు యాష్కీ, దామోదర రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డిలు రాహుల్‌ గాంధీని కలువనున్నారు. 

తెలంగాణలో డిజిటల్ మెంబర్ షిప్‌కు సంబంధించిన చెక్కును కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి అందజేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో రాహుల్ సభతో పాటు ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. 

ఇక, మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు.. రాహుల్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను రాహుల్ వారిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సీనియర్‌ నేతలకు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ అపాయింట్‌మెంట్లు దొరకడం లేదంటూ సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ఈ సందర్భంగా కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి ప్రచారాలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అన్ని అంశాలు పరిశీలిస్తామని రాహుల్‌ వారికి భరోసా ఇచ్చినట్లుగా సమాచారం. 

ఇదిలా ఉంటే.. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్ల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ పోరుకు సిద్దమవుతుంది. ఏప్రిల్‌ నెలంతా ఉద్యమాలు చేయాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గం నిర్ణయించింది. ఏప్రిల్‌ చివరి వారంలో వరంగల్‌ కేంద్రంగా రైతు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బహిరంగ సభకు ఎంపీ రాహుల్‌ గాంధీని ఆహ్వానించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని తీర్మానించింది. 

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు రాష్ట్రంలోని రైతుల తరపున పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో తెలుగులో పోస్టు చేశారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో BJP,TRS ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. రైతలు శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మాని, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుందని ప్రకటించారు.