హైదరాబాద్: కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నాడు రాజ్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆయన గవర్నర్ తమిళిసైకి  వినతి పత్రం సమర్పించారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన ఆ వినతిపత్రంలో కోరారు.  

also read:మేం కలిసే ఉన్నాం, గొడవల్లేవ్: రేవంత్, కోమటిరెడ్డి మంతనాలు

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రుల్లో కరోనా మెడిసిన్స్ ఇంకా లేవన్నారు. కరోనా వ్యాక్సిన్ అందిరికీ ఇవ్వాలని ఆయన కోరారు. వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇదే డిమాండ్ తో  ఈ నెల 7న గాంధీ భవన్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.  ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తామన్నారు. 

యుద్దప్రాతిపదికన వ్యాక్సిన్ వేయాలని గవర్నర్ ద్వారా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఆయన చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చెల్లించిన బిల్లులను పేదలకు రీయింబర్స్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు కరోనా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందన్నారు.