త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్, సీనియర్ నేత విజయశాంతి. మీడియాలో గత కొద్దిరోజులుగా వస్తున్న కథనాలపై స్పందించిన ఆమె తన అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

‘‘తాను ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్నట్లు గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.. నాకు ఏ నియోజకవర్గంలో పోటీ చేసే ఉద్దేశ్యం లేదు.. తెలంగాణ కాంగ్రెస ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌గా నాకు హైకమాండ్ గురుతర బాధ్యతలు అప్పగించింది.

రాబోయే రెండు నెలల వ్యవధిలో పార్టీ తరపున రెండు, మూడు రాష్ట్రాల్లో నిర్వహించబోయే వందలాది సభలు, ర్యాలీల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తాను.. ఇంతటి కీలకమైన కర్తవ్యం ముందున్నప్పుడు కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితమవ్వాలనే ఆలోచన నాకు లేదనే విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను’’ అంటూ ఆమె పోస్ట్ చేశారు.