ఆర్టికల్ 370 రద్దుకి టీఆర్ఎస్ మద్ధతు తెలిపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి.

దేశ సార్వభౌమత్వంతోపాటు దేశ భద్రతకు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ..కేసీఆర్ నచ్చజెప్పి ఒప్పించి వుంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు గురువారం వ్యక్తిగత ఫేస్‌బుక్ పేజీలో ఓ ప్రకటనను విడుదల చేశారు. దేశభద్రతను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్ విభజనతో పాటు ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును సమర్ధిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో చెప్పారని విజయశాంతి తెలిపారు.

అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రాజ్యాంగబద్ధంగా కశ్మీర్ విభజన అంశంపై పార్లమెంటులో చర్చ జరిగి వుంటే తాము కూడా అభ్యంతరం తెలిపేవాళ్లం కాదని ఒవైసీ చెప్పినట్లు రాములమ్మ గుర్తు చేశారు.

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంలు పొత్తుపెట్టుకోనున్న నేపథ్యంలో కశ్మీర్ విభజన బిల్లుకు టీఆర్ఎస్ మద్ధతు తెలపడం ఈ కూటమిపై ప్రభావం చూపవచ్చునని కొందరు విశ్లేషకులు చెప్పారని విజయశాంతి వ్యాఖ్యానించారు.

అయితే కశ్మీర్ విభజన బిల్లుకు టీఆర్ఎస్ ఎందుకు మద్ధతు ఇచ్చిందో ఒవైసీకి వివరించి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ పొత్తుకు ఇబ్బంది కలగకుండా కేసీఆర్ పావులు కదుపుతారని భావిస్తున్నామని వారు చెప్పారు.

ఎందుకంటే అవకాశానికి తగ్గట్లు తమ వైఖరిని ఎలాగైనా మార్చుకోగల సమర్ధత, ప్రజలను ఒప్పించగల చతురత కేసీఆర్ గారికి ఉన్నాయని పలు సందర్భాల్లో రుజువైంది. ఈ వ్యూహాలు ఎత్తులు ఎలా ఉన్నా..తెలంగాణ జనానికి ఇప్పటికే టీఆరెస్ అధినేత వైఖరిపై ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని ఆమె పోస్ట్ చేశారు.