నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహలు రచిస్తోంది. అందరికన్నా ముందుగానే అభ్యర్ధిని ప్రకటించిన హస్తం పార్టీ ప్రచారంలో జోరు పెంచింది.

ఈ క్రమంలో శనివారం హాలియాలో జనగర్జన పేరుతో భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ సాగర్ వచ్చి కాంగ్రెస్ ఏం చేసిందని అంటున్నారని, కాంగ్రెస్ వల్ల ఈ ప్రాంత అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు.

ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో సాగర్‌కు ఏం చేశారో చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రతి గడప తనకు తెలుసునని చెప్పారు.

పోడు భూముల సమస్యను ఇంకా పరిష్కరించలేదని.. వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు అన్యాయం జరుగుతుందని జానారెడ్డి పేర్కొన్నారు. కొందరు కాంగ్రెస్‌లో ఎదిగి పార్టీకే అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం  తమ పదవులను త్యాగం చేశామని.. సాగర్ ద్వార ఆరున్నర లక్షల ఎగరాలకు నీరు ఇచ్చామని జానారెడ్డి గుర్తుచేశారు. భూపరిహార చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్సేనని... గిరిజనుల కోసం అటవీ హక్కుల చట్టం తెచ్చామని ఆయన వెల్లడించారు.

సర్పంచ్‌గా గెలవలేని వారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారని జానారెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతలు నీళ్లు ఇవ్వలేదని ఆరోస్తున్నారని.. ఈ జిల్లాకు సాగర్ ద్వారా నీళ్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్ వస్తే తీసుకెళ్లి చూపిస్తానని.. నేను సాగర్‌కు ఏం చేశానో అడగటానికి మీకు హక్కు లేదంటూ జానారెడ్డి హెచ్చరించారు. తాను తొలిసారి ఎమ్మెల్యే అయ్యే నాటికి సాగర్ నియోజకవర్గంలోని 168 తండాల్లో ఒక తండాకి మాత్రమే కరెంట్ వుండేదని.. తాను వచ్చిన తర్వాత 167 తండాలకు వెలుగునిచ్చానని ఆయన చెప్పారు.

పశువుల్లా కొందరు ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని.. వారందరికీ బుద్ధి వచ్చేలా ఉప ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు.