హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేత కె. జానా రెడ్డి స్పష్టత ఇచ్చారు. పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో తెలంగాణ పీసీసీ ఇంచార్జీ మాణిక్య ఠాగూర్ ఆయనకు ఫోన్ చేశారు. ఆ విషయంపై మాణిక్యం ఠాగూర్ కు జానా రెడ్డి స్పష్టత ఇచ్చారు. 

తాము పార్టీ మారేది లేదని జానా రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెసు అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని, అటువంటి స్థితిలో తాను పార్టీ ఎందుకు మారుతానని ఆయన అన్నారు. జానా రెడ్డి పార్టీ మారుతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. 

జానారెడ్డి బిజెపిలో చేరి నాగార్జునసాగర్ శానససభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం సంప్రదింపులు జరపడానికి మాణిక్యం ఠాగూర్ హైదరాబాదు వచ్చారు. కీలకమైన నేతలతో ఆయన సమావేశమవుతున్నారు. కాసేపట్లో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. 

పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డి చేరుగా వచ్చినప్పటికీ పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సీనియర్ నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి చాలా మంది సమర్థులున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తాను కూడా పీసీసీ రేసులో ఉన్నట్లు తెలిపారు. సీనియర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పరాజితుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని ఆయన అన్నారు. సమన్వయంతో పనిచేసే నాయకుడికి అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు.