హైదరాబాద్: కాంగ్రెసు నాయకుడు గజ్జెల కాంతం చిక్కుల్లో పడ్డారు. రూ. 15 లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఆరోపణపై ఆయన మీద హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.  హరితహారం కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మబలికి గజ్జెల కాంతం ఓ వ్యాపారి నుంచి 2016లో రూ. 15 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

గజ్జెల కాంతంపై ఆగస్టు 1వ తేదీననే కేసు నమోదైంది. అయితే, ఆ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మొక్కలను ఎగుమతి, దిగుమతి చేసే వ్యాపారి విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజ్జెల కాంతంపై కేసు నమోదైంది. 

విజయ్ కుమార్ 2016 సెప్టెంబర్ లో గజ్జెల కాంతంకు 15 లక్షల రూపాయలు ఇచ్చారు. కాంట్రాక్టు దక్కకపోతే ఆ సొమ్మును తిరిగి ఇచ్చేసే విధంగా షూరిటీ కూడా తీసుకున్నారు. డబ్బు చేతికి రాగానే గజ్జెల కాంతం విజయ్ కుమార్ తో సంబంధాలను తెంపుతూ వచ్చారు. 

కాంతం చేసిన సంతకం ఉన్న చెక్ ను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి విజయ్ కుమార్ ప్రయత్నించాడు. అయితే, సంతకం కాంతం సంతకంతో సరిపోలడం లేదని బ్యాంక్ అధికారులు చెప్పారు. దాంతో తాను మోసపోయినట్లు గుర్తించిన విజయ్ కుమార్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.