పొత్తు వ్యాఖ్యలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాణిక్ రావు థాక్రే షాక్
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందంటూ ఆ పార్టీ నేత , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే స్పందించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందంటూ ఆ పార్టీ నేత , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ మాణిక్ రావు థాక్రే స్పందించారు. నిన్న చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి ఉపసంహరించుకున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులుండవని మాణిక్ రావు తెలిపారు. ప్రస్తుతం నేతలంతా ఐక్యంగా వున్నారని.. నాయకులంతా త్వరలోనే పాదయాత్రలు చేస్తారని థాక్రే స్పష్టం చేశారు. బీజేపీ లాంటి శక్తులు పొత్తుల పేరుతో తమను వీక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని థాక్రే పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత బలం కాంగ్రెస్‌కు వుందని ఆయన స్పష్టం చేశారు.
అయితే.. తాను చేసిన వ్యాఖ్యలను మాణిక్ రావు థాక్రే లైట్ గా తీసుకున్నారని ఉదయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. థాక్రేతో భేటీ తర్వాత ఆయన ఆ విధంగా చెప్పారు. తమ పార్టీ వాళ్లు కూడా తన వీడియోను పూర్తిగా చూడలేదని.. వచ్చే ఎన్నికల్లో ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవద్దని తాను థాక్రేకు చెప్పానన్నారు. బీఆర్ఎస్ తో పొత్తుపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ జరగలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాకు తెలిపారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టపోయినట్టుగా ఠాక్రేకు వివరించినట్టుగా ఆయన చెప్పారు. పొత్తులపై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. అయితే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని థాక్రే మీడియాతో చెప్పారు. దీన్ని బట్టి వెంకట్ రెడ్డితో థాక్రే కొంత మేరకు కఠినంగానే మాట్లాడినట్లు అర్థమవుతోంది.
ALso REad: పొత్తులపై నా వ్యాఖ్యలపై చర్చే లేదు: ఠాక్రేతో భేటీ తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇదే అంశంపై నిన్న మాణిక్ థాక్రేతో వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలోని లాంజ్‌లో వీరిద్దరూ సమావేశమయ్యారు. అంతకుముందు ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్నే తాను ఇప్పుడు చెప్పినట్లు కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీకి ఎవరితోనూ పొత్తు వుండదని వెంకట్ రెడ్డి అన్నారు. చిన్న చిన్న నాయకులు కూడా తనను తిట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు నా వ్యాఖ్యల్ని రాజకీయం చేస్తున్నారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో హంగ్ వస్తుందని తాను అనలేదని ఆయన పేర్కొన్నారు. తాను ఏ కమిటీలోనూ లేనని.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి తాను నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానని కోమటిరెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్‌తో పొత్తు వుంటుందని కూడా తాను చెప్పలేదని.. తన వ్యాఖ్యలు అర్ధం అయ్యే వాళ్లకు అర్ధం అవుతాయని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
కాగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తులుంటాయని వెంకట్ రెడ్డి బుధవారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సెక్యులర్ పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలానికి కారణమయ్యాయి.