Telangana: గతంలోనూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు కూడా ఉన్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.  కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోయిందని పేర్కొన్నారు. 

BJP Leader DK Aruna: వ‌చ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి తెలంగాణ‌లో అప్పుడే మొద‌లైంది. రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన పార్టీలు అధికారం దక్కించుకోవాల‌ని చూస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ.. పొలిటిక‌ల్ హీట్ ను పెంచుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కాంగ్రెస్ పార్టీపై మ‌రొసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. గతంలోనూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు కూడా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోయిందని ఆమె అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉన్నట్లు కనిపించిందని, అయితే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, రాష్ట్రంలో పార్టీ అవకాశాల గురించి ప్రజలు చర్చించడం కూడా మానేశార‌ని డీకే అరుణ అన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై డీకే అరుణ విమ‌ర్శ‌లు గుప్పించారు. న్యూఢిల్లీతో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ కొరత ఉందని అన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాటలకు డ్యాన్స్ చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై తాను చేసిన ఆరోపణలను నిరూపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ను డిమాండ్ చేశారు. "రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ నేతలు కూడా బ్లాక్‌మెయిలర్‌గా, ల్యాండ్‌మాఫియా లీడర్‌గా అభివర్ణిస్తున్నారు. అతను బండి సంజయ్‌పై తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తాడు?" అని డీకే అరుణ ప్రశ్నించారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాషాయ పార్టీని అధికారంలోకి తెస్తారని డీకే. అరుణ పేర్కొన్నారు. ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట పాద‌యాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై ఇటీవ‌ల రేవంత్ రెడ్డి తీవ్ర‌ ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై స్పందించిన ఆమె.. పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి పిచ్చి ప్రేలాపనలు చేస్తారా? అని మండిపడ్డారు. టీఆర్ఎస్ – కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. వాళ్లిద్దరు కుమక్కై మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయబోతున్నారని ఆరోపించారు. "రేవంత్ రెడ్డి.. బండి సంజయ్ కుమార్ పై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ముందా?. బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి జోగులాంబ అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేసేందుకు సిద్ధం... నువ్వు సిద్ధమా? అంటూ డీకే ఆరుణ స‌వాలు విసిరారు. రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు నిరాధారమని నిరూపిస్తామ‌ని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…