నేడే తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ: 530 మందితో ఆశావాహుల జాబితా
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ హైద్రాబాద్ లో భేటీ కానుంది.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఆదివారంనాడు సాయంత్రం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. గత వారమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా ఆశావాహుల ధరఖాస్తులపై చర్చించారు.
అయితే గత సమావేశంలో ఆశావాహులకు సంబంధించిన పూర్తి సమాచారం లేదని కొందరు ఎన్నికల కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో ఇవాళ జరిగే సమావేశంలో పూర్తి సమాచారం అందించనున్నారు.
ఆశావాహులు గతంలో ఏఏ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు, ఎన్ని దఫాలు విజయం సాధించారు? ఎన్ని దఫాలు ఓటమి పాలయ్యారు?కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుండి పనిచేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వంపై ఆశావాహులు చేసిన పోరాటాలకు సంబంధించిన అంశాలను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పరిశీలించనుంది.
గత నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సుమారు 1006 మంది నుండి ధరఖాస్తులు వచ్చాయి. ఈ ధరఖాస్తుల నుండి 530 మందితో ఆశావాహుల జాబితాను కాంగ్రెస్ పార్టీ సిద్దం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఇచ్చిన జాబితాతో రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఎన్నికల కమిటీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది. ఈ చర్చల తర్వాత ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్క అభ్యర్థి పేరును సూచిస్తూ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేయనుంది. స్క్రీనింగ్ కమిటీ సూచించిన పేరును కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించనుంది. వరుసగా మూడు రోజుల పాటు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేయనుంది.
also read:అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: నేడు ఎన్నికల కమిటీ భేటీ
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం బీసీ సామాజిక వర్గం నుండి ధరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు. వారి చరిత్ర గురించి ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు 35 నుండి 40 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నారు. అయితే 32 అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కేటాయించే అవకాశం ఉంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీసీలకు కేటాయించాలని భావిస్తుంది. ఈ నెలాఖరులో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది.