తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులతో ‘‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్’’ అని మానవహారం చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ మంగళవారం మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు(జూన్ 24) వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు వివిధ రూపాల్లో కేటీఆర్ బర్త్ డే వేడుకలను నిర్వహించారు. కొందరు ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేస్తే మరికొందరు అన్నదానం, రక్తదానం, రోగులకు పండ్ల పంపిణీ వంటివి చేస్తూ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. మరికొందరైతే వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే సోమవారం మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులతో ‘‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్’’ అని మానవహారం చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. కరీంనగర్‌లోని చొప్పదండిలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుందని కాంగ్రెస్ పేర్కొంది. ఇదిలా ఉంటే, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నిన్నటి నుంచే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ ఫొటోలో Happy Birthday KTR అని కనిపించేలా విద్యార్థులను వంగి కూర్చొబెట్టడం చూడొచ్చు. అయితే ఇలా చేసేందుకు విద్యార్థులను బలవంతంగా బెదిరించారని కాంగ్రెస్ ఆరోపించింది. మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదుచేసినవారి కాంగ్రెస్ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, టీపీసీసీ వోకింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ తదితరులు ఉన్నారు. ఈ ఫిర్యాదు కాపీని కరీంనగర్ కలెక్టర్, డీఈవో, గగంధర మండల ఎంఈవోలకు కూడా పంపించారు. ఘటనకు బాధ్యులైన మంత్రి కేటీఆర్, స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా తన ఫేస్‌బుక్ పోస్టులో కూడా దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. ‘‘పాఠశాలకు చదువు పట్ల కొంత అంకితభావం, నిబద్ధత ఉంటే, పాఠశాల ఎంతో మంది పిల్లల భవితవ్యాన్ని మార్చివేస్తుంది. అయితే ఈ నిబద్ధత "యువరాజా"ని ప్రసన్నం చేసుకోవడానికే తప్ప పిల్లల సంక్షేమం కోసం కాదు. రాజకీయ నాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు పిల్లలను శిక్షించే హక్కు ఈ పాఠశాలకు ఏముంది?’’ అని దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.
