మేడ్చల్‌ జిల్లా కీసరలో జూన్‌ 1, 2 తేదీల్లో రాష్ట్రస్థాయి చింతన్‌ శిబిర్‌ నిర్వహించనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రెండు రోజులపాటు జరిగే రాష్ట్ర స్థాయి చింతన్‌ శిబిర్‌లో వివిధ అంశాలను చర్చించనున్నట్టుగా చెప్పారు.

మేడ్చల్‌ జిల్లా కీసరలో జూన్‌ 1, 2 తేదీల్లో రాష్ట్రస్థాయి చింతన్‌ శిబిర్‌ నిర్వహించనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం గాంధీ భవన్‌లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజులపాటు జరిగే రాష్ట్ర స్థాయి చింతన్‌ శిబిర్‌లో వివిధ అంశాలను చర్చించేందుకు ఆరు గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయరంగం బలోపేతం, సామాజిక న్యాయాలపై చర్చ ఉంటుందన్నారు. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాలను చర్చించబోమని.. వాటిని ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చ ఉంటుందన్నారు. 

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో.. దాన్ని నెరవేర్చేందుకు కషి చేస్తామని భట్టి తెలిపారు. తనపై కాంగ్రెస్‌ నేతలు దాడి చేశారని మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారని.. ఆధారాలు ఉంటే చూపాలన్నారు. మల్లారెడ్డి సాధారణ వ్యక్తి కాదని.. ఆయన మంత్రి అని ఆయనపై కుట్ర జరిగితే ఆధారాలు బయటపెట్టకుండా ప్రభుత్వం నిద్రపోతుందా అని భట్టి ప్రశ్నించారు. 

ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ సభ (rahul gandhi warangal meeting) తర్వాత టీ కాంగ్రెస్‌ కొత్త జోష్‌తో ముందుకు వెళ్తుంది. వరంగల్ సభలో రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోగా రైతులకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పలు పంటలకు ఎంఎస్‌పీ కల్పిస్తామని చెప్పారు. ‘వరంగల్ డిక్లరేషన్’ను గ్రామాలకు వెళ్లి వివరించాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు సూచించారు. రైతులకు చేసిన 9 వాగ్దానాల కరపత్రం వారి చేతుల్లో ఉండేలా నాయకులు, కార్యకర్తలు చూసుకోవాలని చెప్పారు. ప్రతి యువకుడి చేతిలో కూడా కరపత్రం కనిపించాలన్నారు. 

ఈ క్రమంలోనే రచ్చబండ (rachabanda) కార్యక్రమానికి టీ. కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. మే 21న ప్రారంభించిన రచ్చబండను 30 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు 300 మంది సమన్వయకర్తలను పార్టీ నియమించింది. రానున్న 30 రోజుల్లో తెలంగాణలోని 12,000 గ్రామాలను కవర్ చేయనున్నారు. కోఆర్డినేటర్లు.. వరంగల్ డిక్లరేషన్‌ను ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్లడానికి సమావేశాలను ప్లాన్ చేస్తారు. ఇక, సీనియర్ నేతలందరికీ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను అప్పగించి, వారి భాగస్వామ్యం తప్పనిసరి చేశారు.