ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరాలనే ప్రతిపాదనను తిరస్కరించినట్టుగా మంగళవారం వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరాలనే ప్రతిపాదనను తిరస్కరించినట్టుగా మంగళవారం వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొంతకాలంగా పీకే కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. ఓవైపు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపిన పీకే.. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపారు. దీంతో ఓవైపు టీఆర్‌ఎస్ శ్రేణుల్లో, మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళానికి దారితీసింది. పీకే.. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లతో చర్చలు జరిపిన నేపథ్యంలో.. ఆ రెండు పార్టీలు ఒకటేనని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ పరిణామాలు ఇరు పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో మంతనాలు సాగించిన పీకే.. ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ కోసం ఇప్పటికే సర్వేలు చేయించారు. ఈ క్రమంలోనే పీకే కాంగ్రెస్‌లో చేరితే తెలంగాణలో పార్టీకి నష్టం చేకూరుతుందని కొందరు కాంగ్రెస్ నేతలు భావించారు. మరోవైపు కొందరు టీఆర్ఎస్ నాయకులు.. పీకే కాంగ్రెస్‌లో చేరి, ఆయనకు చెందిన ఐ ప్యాక్ తమ పార్టీ కోసం పనిచేస్తే క్యాడర్‌లోకి, ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని భావించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ఒకటేనని బీజేపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్టుగా అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పీకే కాంగ్రెస్‌లో చేరకపోవడం అటు టీ కాంగ్రెస్‌లో, ఇటు టీఆర్ఎస్ నాయకులకు బిగ్ రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక, ఈ పరిణామాలపై పేరు చెప్పడానికి ఇష్టపడని టీఆర్ఎస్ నాయకుడు ఒకరు.. ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని రోజులుగా పీకే కాంగ్రెస్‌లో చేరవచ్చనే వార్తలతో గందరగోళం నెలకొంది. తర్వాత పీకే.. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసి చర్చలుజరిపిన తర్వాత.. ఐ-ప్యాక్ మా కోసం పనిచేస్తుందని అధికారిక ప్రకటన రావడంతో కాస్త ఊరట కలిగింది. అయితే టీఆర్ఎస్.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందని బీజేపీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. అది మాకు ఇబ్బందికరంగా ఉండేది. అంతా మా మంచికే జరిగినందుకు మేము సంతోషిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ఆఫర్‌ను నిరాకరించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కన్సెల్టెంట్ లేకుండా చాలా ఎన్నికల్లో గెలిచిందన్నారు. తమ అధినాయకత్వంలో పార్టీ శ్రేణులను నడిపించడానికి అవసరమైన వ్యుహాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోదీల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడే స్పూర్తి తమ క్యాడర్‌కు ఉందన్నారు. అయితే పీకే చర్య కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ అనే మాటను రేవంత్ కొట్టిపారేశారు. ఇది ప్రశాంత్ కిషోర్‌కి ఎదురుదెబ్బే కావచ్చని అన్నారు. కాంగ్రెస్‌లో చాలా మంది చేరాలని అనుకుంటున్నారని చెప్పారు. తాము వారిని స్వాగతిస్తామని.. అయితే వారు తమ పార్టీ సిద్దాంతాలను, పార్టీ నాయకత్వాన్ని అంగీకరిస్తే మాత్రమే చేర్చుకుంటామని చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సిద్ధాంతాలు లేని నరేంద్ర మోదీ, కేసీఆర్‌తో సహా అనేక పార్టీలతో కాపురం చేసిన వ్యక్తి మాతో చేరకపోవడం కాంగ్రెస్‌కు సానుకూల పరిణామమని అన్నారు. మా కార్యకర్తలు ఆయనను విశ్వసించడం కష్టమే’’ అని అభిప్రాయపడ్డారు.
ఇక, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరకపోవడానికి.. పార్టీలో ఆయనకు స్వేచ్చ ఇవ్వడానికి అధిష్టానం అంగీకరించలలేదని నివేదికలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ కొత్త ముఖంతో ముందుకు వెళ్లాలని, ఎన్నికల ప్రచారంపై పూర్తి నియంత్రణ వంటి అంశాలపై కాంగ్రెస్, పీకేల మధ్య చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు నిరాకరించినట్టుగా తెలుస్తోంది.
