Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ప్రాజెక్టులపై క్రిష్ణ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు..

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. 

Telangana complaint on AP projects to Krishna Board - bsb
Author
Hyderabad, First Published Jun 23, 2021, 11:20 AM IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. 

ఈమేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ కృష్ణా బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌కు లేఖ రాశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)స్టే విధించినప్పటికీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్జీటీ ఆదేశాలను కృష్ణా బోర్డు అడ్డుకోలేకపోయిందన్నారు. 

డీపీఆర్‌ కోసం ప్రాథమిక పనులు అని చెప్పిన ఏపీ ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తోందని  ఆక్షేపించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా అక్కడకు పంపలేకపోయిందన్నారు. కృష్ణా బోర్డు అనుమతులు, ఆమోదం లేకుండా పనులు చేపట్టరాదని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. 

ఇటీవల జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఏపీ వైఖరిని తీవ్రంగా నిరసించారన్న రజత్‌కుమార్‌.. ఏపీ చర్యలతో తెలంగాణలోని కృష్ణాబేసిన్‌లో ఉన్న కరవు, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగు చర్యలు తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. 

కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన చిత్రాలను కూడా లేఖతో జతపరిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios