నాగర్ కర్నూల్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్.  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు గురువారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. 

కర్వేన, వట్టెం రిజర్వాయర్, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లను సీఎం కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. కేసీఆర్ పర్యటనల్లో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  కొల్లాపూర్ లోని వట్టెం రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. 

అనంతరం నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ పంప్ హౌజ్, హెలీపాడ్ ఏర్పాటు పనులను కూడా నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడంతో సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్షేత్రస్థాయి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించి పనుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారని స్పష్టం చేశారు.  

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ఏదుల, వట్టెం పంప్‌హౌస్ పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని తెలిపారు. నార్లాపూర్ పంప్ హౌజ్ అటీవీ ప్రాంతంలో ఉన్నందున కొంత ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. 

వట్టెం 55% , కర్వెన 45%, ఏదుల 98%, నార్లాపూర్ పనులు 60 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ముందుగా రోజుకు టీఎంసీ నీళ్లు ఎత్తిపోసే పనులు పూర్తిచేసి, వర్షాకాలంలో రోజుకు అదనంగా మరో టీఎంసీ ఎత్తిపోసుకుని 100 రోజుల్లో 100 టీఎంసీలు ఎత్తిపోసి పదిలక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. మొత్తంగా ఉమ్మడి పాలమూరులో 20 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 

మరోవైపు సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. భూత్పూర్ మండలంలోని కర్వేన రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. 

సీఎం పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. సీఎం పర్యటన అనంతరం పాలమూరు ఎత్తిపోతలపథకం పనుల్లో వేగం పుంజుకుని ఏడాదిలోపు సాగునీరు అందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.