తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తన స్వగ్రామం చింతమడకకు వెళ్లనున్నారు. గ్రామాన్ని సందర్శించి అనంతరం గ్రామస్తులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.

అభివృద్ధి పనులను పరిశీలించి.. సమస్యలపై ఆయన ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు.... గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి, సీపీ జోయల్ డేవీస్ వారం రోజుల నుంచి దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే చింతమడక గ్రామంలోనికి, సభాస్థలికి, సహపంక్తి భోజనాల వద్దకు అనుమతించాలని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచించారు.