పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన గురువారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ కావడంతో సీఎం దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. బేగంపేట నుంచి హెలికాఫ్టర్‌లో కరివెనకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం ఆయన రోడ్డుమార్గం గుండా నాగర్‌కర్నూలు జిల్లా వట్టెం చేరుకుని ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ. . ఇక నుంచి కాంట్రాక్టర్లకు బిల్లుల చింతలేదన్నారు.

ఉదయం బిల్లులు పెడితే.. సాయంత్రానికి వాటిని క్లియర్ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. సిబ్బందిని పెంచుకుని.. కాంట్రాక్టరులు పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించారు.

అధికారులంతా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని.. నాలుగున్నర నెలల టార్గెట్‌తో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

వచ్చే వర్షాకాలం నాటికి రైతులకు నీళ్లివ్వాలని... పనుల్లో అలసత్వాన్ని సహించనని ముఖ్యమంత్రి హెచ్చరించారు. భూసేకరణ సమస్యలన్నీ పరిష్కరించామని.. మూడు షిఫ్టుల్లో నిరంతరాయంగా పనిచేయాలని పేర్కొన్నారు.