గజ్వేల్: రాజకీయ నాయకులు రిలాక్స్ అనే పదానికి దూరంగా ఉంటూ నిరంతరం ప్రజాసేవకే అంకితం కావాలని సూచించారు తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్. పైరవీలు, పార్టీలకు అతీతంగా పరిపాలన అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు కేసీఆర్. తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన కేసీఆర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 

గజ్వేల్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అనంతరం మహతి వేదికలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. నారద మహర్షి వాయించే వీణపేరు మహతి అని అందుకే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ లోని వేదికకు పెట్టినట్లు తెలిపారు. తెలంగాణ సాహితీ సౌరభం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఇలాంటి వేదికలను నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 

గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని తెలిపారు. 

త్వరలో నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఒకరోజు సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. ప్రతీ ఇంటికి పాడిపశువు అందిస్తానని, ఇల్లులేని నిరుపేదవాడు నియోజకవర్గంలో ఉండకూడదన్నదే తన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. 

రాష్ట్రాన్ని ఆర్థికమాంద్యం వెంటాడుతుందని తెలిపారు. మంత్రి హరీష్ రావు, కలెక్టర్ ఇతర అధికారులంతా కలిసి నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులపై వివరాలు ఇవ్వాలని కోరారు. గ్రామసర్పంచ్, ఎంపీటీసీలకు మంచి గౌరవం కల్పిస్తానని తెలిపారు. 

గజ్వేల్ నియోజకవర్గం నుంచే హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం తన నియోజకవర్గం కాబట్టి అభివృద్ధి విషయంలో కాస్త స్వార్థం ఉంటుందన్నారు. తన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. 

ఇకపోతే నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులు చాలా ఉన్నాయని అన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మంత్రి హరీష్ రావు తనను రెండు సార్లు పొగిడారని చెప్పుకొచ్చారు. పొగిడితే గ్యాస్ ఎక్కువ అయి పని చేయలేరన్నారు. పొగడటం తప్పు అంటూ చెప్పుకొచ్చారు. 

రాజకీయ నాయకులకు విశ్రాంతి అనేది ఉండకూడదన్నారు. అత్యున్నత స్థాయి మంచితనం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలన్నారు. అన్ని రంగాల్లో అగ్రస్థానంలోనే ఉండాలని సూచించారు. నాలుగు మంచి పనులు చేసినంత మాత్రాన సంతోషపడొద్దన్నారు. గ్రామంలో లేదా పట్టణంలో ఉపాధి లేని వ్యక్తులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కేసీఆర్.