హైదరాబాద్: ఈనెల 14న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీ పర్యటన రద్దు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గృహప్రవేశం, విశాఖ శారదా పీఠంలో కేసీఆర్ పర్యటించాలని నిర్ణయించారు. అయితే అనూహ్యంగా కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. 

ఇకపోతే గురువారం విశాఖపట్నంలోని శారద పీఠంలో నిర్వహించనున్న రాజశ్యామల యాగానికి సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది. అయితే రాజశ్యామల యాగానికి సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదని శారదపీఠం నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. అయితే కేసీఆర్ తరఫున రాజశ్యామల యాగానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.  

మరోవైపు వైఎస్ జగన్ నూతన గృహప్రవేశం వాయిదా పడటం వల్లే కేసీఆర్ పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. విశాఖపట్నం శారదపీఠంలో రాజశ్యామల యాగానికి హాజరుకావడంతోపాటు అంతకు ముందే ఉదయం 8గంటల 21 నిమిషాలకు అమరావతి తాడేపల్లిలోని జగన్ గృహ ప్రవేశానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. 

అయితే వైఎస్ జగన్ సోదరి షర్మల అనారోగ్యం కారణంగా గృహ ప్రవేశం వాయిదా పడింది. దీంతో కేసీఆర్ విశాఖపట్నం పర్యటనను కూడా రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆయన ప్రతినిధిగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి యాగానికి హాజరుకానున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌తో కేసీఆర్ భేటీ వాయిదా: కారణమిదే....

వైఎస్ జగన్ గృహప్రవేశం వాయిదా